Maruti : పెట్రోల్, కరెంట్ అక్కర్లేదు.. త్వరలో ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు తెస్తున్న మారుతి
త్వరలో ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు తెస్తున్న మారుతి
Maruti : భారత ఆటోమొబైల్ మార్కెట్లో పెట్రోల్, సీఎన్‌జీ కార్లతో అగ్రస్థానంలో ఉన్న మారుతి సుజుకి సంస్థ ఇప్పుడు భవిష్యత్తు ఇంధన టెక్నాలజీ వైపు దృష్టి సారించింది. మారుతి తమ ప్రసిద్ధ కాంపాక్ట్ క్రాసోవర్ కారు ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ వేరియంట్‌ను జపాన్ మొబిలిటీ షో 2025లో ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రదర్శన అక్టోబర్ 29 నుండి నవంబర్ 9, 2025 వరకు జరుగుతుంది. అధికారిక ఆవిష్కరణకు ముందే మారుతి ఈ కొత్త కారు డిజైన్, ఆసక్తికరమైన గ్రాఫిక్స్‌ను విడుదల చేసింది. ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు, దాని పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది.
ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ వేరియంట్‌లో యెల్లో కలర్ స్టిక్కర్లు, గ్రాఫిక్స్ కారు బోనెట్, డోర్లు, సైడ్ ప్రొఫైల్‌పై ఉండి స్పెషల్ గా కనిపిస్తాయి. ఇందులో స్పోర్టీ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, క్రోమ్ డిటెయిల్స్, బ్లాక్ కలర్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, వాలుగా ఉండే పైకప్పు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్ వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే, మారుతి సుజుకి 1.2 లీటర్ లేదా 1.5 లీటర్ ఇంజిన్‌లలో ఒకదాన్ని ఇందులో ఉపయోగించే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ రెండు ఇంజిన్లు ఫ్లెక్స్ ఫ్యూయెల్‌తో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
మారుతి సుజుకి సంస్థ తమ మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ వెహికల్‌ను మార్చి 2026 నాటికి భారతదేశంలో ప్రవేశపెడతామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 2023 ఆటో ఎక్స్‌పో, 2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించిన మారుతి వాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ లేదా తాజాగా వార్తల్లో ఉన్న ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఈ రెండింటిలో ఏదో ఒకటి మొదటగా భారత మార్కెట్‌లోకి రావచ్చని అంచనా. ఫ్లెక్స్ ఫ్యూయెల్ వెహికల్స్ ఇథనాల్‌తో నడుస్తాయి కాబట్టి, ఇది ఇంధన దిగుమతి ఖర్చును తగ్గించడంలో ప్రభుత్వ లక్ష్యానికి మద్దతు ఇస్తుంది.