Maruti Suzuki Fronx : మారుతి మాస్టర్ ప్లాన్.. దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే కారుగా ఫ్రాంక్స్

దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే కారుగా ఫ్రాంక్స్

Update: 2026-03-05 09:15 GMT

Maruti Suzuki Fronx : భారతదేశంలో మధ్యతరగతి ప్రజలకు అత్యంత ఇష్టమైన కార్ల బ్రాండ్ ఏదంటే ఠక్కున వినిపించే పేరు మారుతి సుజుకి. తక్కువ ధరకు లభించడం, మెయింటెనెన్స్ తక్కువగా ఉండటంతో పాటు లీటరు పెట్రోల్‌కు ఎక్కువ కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు మారుతి తన మైలేజ్ రికార్డులను తానే తిరగరాసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఉన్న మైలేజ్ కార్లన్నింటినీ వెనక్కి నెడుతూ, ఏకంగా లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే సరికొత్త ఫ్రాంక్స్ హైబ్రిడ్‎ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇది గనుక నిజమైతే, దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే కారుగా ఫ్రాంక్స్ చరిత్ర సృష్టించడం ఖాయం.

ఇటీవలి కాలంలో ఈ ఫ్రాంక్స్ హైబ్రిడ్ టెస్ట్ మోడల్స్ రోడ్లపై పదే పదే కనిపిస్తున్నాయి. ఈ టెస్టింగ్ కార్ల వెనుక హైబ్రిడ్ అనే బ్యాడ్జ్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇందులో వాడే టెక్నాలజీ మామూలు హైబ్రిడ్ కార్ల కంటే భిన్నంగా ఉండబోతోంది. సాధారణంగా హైబ్రిడ్ కార్లలో ఇంజిన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిసి చక్రాలను తిప్పుతాయి. కానీ, ఫ్రాంక్స్‌లో సిరీస్ హైబ్రిడ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇందులో పెట్రోల్ ఇంజిన్ నేరుగా చక్రాలను తిప్పదు, కేవలం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. చక్రాలను మాత్రం ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే తిప్పుతుంది. దీనివల్ల ఇంధన వినియోగం చాలా తగ్గి, మైలేజ్ అద్భుతంగా పెరుగుతుంది.

కొత్త ఫ్రాంక్స్ హైబ్రిడ్ కోసం మారుతి తన పాపులర్ 1.2-లీటర్, 3-సిలిండర్ Z12E పెట్రోల్ ఇంజిన్ ను వాడుతోంది. ఇదే ఇంజిన్ ప్రస్తుతం కొత్త స్విఫ్ట్ మరియు డిజైర్ కార్లలో ఉంది. మైలేజ్‌తో పాటు సేఫ్టీ విషయంలోనూ మారుతి ఎక్కడా తగ్గడం లేదు. ఈ కారులో అడాస్ లెవల్-2 ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల కారు దానంతట అదే వేగాన్ని నియంత్రించుకోవడం, ముందు వెళ్లే వాహనాల దూరాన్ని బట్టి బ్రేకులు వేయడం, లేన్ మారకుండా చూసుకోవడం వంటి అత్యాధునిక ఫీచర్లు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు కూడా ఉండబోతున్నాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కారులో ఏడబ్ల్యూడీ సిస్టమ్‌ను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇది పక్కా 4x4 ఆఫ్-రోడర్ కాకపోయినప్పటికీ, బురద లేదా జారుడుగా ఉండే రోడ్లపై కారు స్కిడ్ అవ్వకుండా మంచి గ్రిప్‌ను అందిస్తుంది. గ్రాండ్ విటారాలో ఉన్నటువంటి టెక్నాలజీనే ఇందులోనూ చూడవచ్చు. ఈ కారు 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ మరియు కియా సోనెట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, టయోటా కూడా దీనిని తన బ్రాండ్ పేరుతో (టైజర్ హైబ్రిడ్) రీ-లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News