Maruti : హైబ్రిడ్ వెర్షన్‌లో మారుతి సుజుకి ఫ్రాంక్స్.. మైలేజ్‌లో టాప్, సీఎన్‌జీ బాధలు ఉండవ్!
మైలేజ్‌లో టాప్, సీఎన్‌జీ బాధలు ఉండవ్!
Maruti : దేశంలో అత్యధిక కార్లు అమ్ముతున్న సంస్థ మారుతి సుజుకి ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా మారుతి సుజుకి ఇప్పుడు తమ పాపులర్ కారు మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్ వెర్షన్‌పై పని చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ ఫ్రాంక్స్ హైబ్రిడ్ వెర్షన్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. ఇటీవల దేశంలో మొదటిసారిగా దీన్ని టెస్టింగ్ సమయంలో చూశారు. దీనిని బట్టి మారుతి త్వరలోనే దీన్ని లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ మోడల్‌లో లిడార్ సెన్సర్లు కూడా ఉన్నాయి. దీని ద్వారా రాబోయే హైబ్రిడ్ ఫ్రాంక్స్ ఏడీఏఎస్ (ADAS) సిస్టమ్‌తో కూడా రావచ్చునని ఊహిస్తున్నారు. మారుతి ఫ్రాంక్స్‌లో లెవెల్-2 ఏడీఏఎస్ ఇవ్వవచ్చు. ఇటీవల వచ్చిన ఇ-విటారా, లెవెల్-2 ఏడీఏఎస్ ఇచ్చిన మారుతి మొదటి కారు. ఇ-విటారా మాదిరిగానే మారుతి ఇతర మోడళ్లలో కూడా సేఫ్టీ సిస్టమ్ ముందుకు తీసుకెళ్లవచ్చని భావిస్తున్నారు.
సుజుకి మోటార్ కార్పొరేషన్ తన పవర్‌ట్రెయిన్ రోడ్‌మ్యాప్‌ను విడుదల చేసిన సమయంలోనే ఈ ప్రోటోటైప్ కనిపించడం ఆసక్తికరంగా ఉంది. కనిపించిన కారు ప్రస్తుత పెట్రోల్ వెర్షన్ లాగే ఉంది. వెనుక వైపున హైబ్రిడ్ బ్యాడ్జ్ మాత్రమే తేడా ఉంది. ఇది మారుతి సుజుకి బలెనో ఆధారిత క్రాసోవర్ హైబ్రిడ్ వెర్షన్ అని సూచిస్తుంది. ఇది నెక్సా షోరూమ్ నెట్‌వర్క్ నుండి అమ్ముడవుతుంది.
రాబోయే మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్‌లో కొత్త సూపర్ 48V హైబ్రిడ్ సిస్టమ్ లభించే అవకాశం ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారును కొత్త 1.0 లీటర్ లేదా 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో జత చేస్తారు. మిగిలిన డిజైన్, ఫీచర్లు దాదాపు పాతవిగానే ఉంటాయి. అయితే, ప్రస్తుత సేఫ్టీ ఫీచర్లతో పాటు లెవల్ 2 ఏడీఏఎస్ కూడా ఇవ్వవచ్చు.
కంపెనీ ఇంకా పవర్, టార్క్, మైలేజ్ గురించి ఏమీ వెల్లడించలేదు. లాంచ్ టైమ్‌లైన్ కూడా ఇంకా బయటకు రాలేదు, కానీ కారు టెస్టింగ్ సమయంలో ఎలాంటి కవర్ లేకుండా కనిపించింది కాబట్టి, ఇది కొన్ని నెలల్లో ఈ సంవత్సరంలోనే లాంచ్ కావచ్చని ఆశిస్తున్నారు. ఫ్రాంక్స్ భారతదేశం నుండి అత్యంత వేగంగా ఎగుమతి అవుతున్న క్రాసోవర్ కారు. జూన్ 2023 నుండి కేవలం 25 నెలల్లో లక్ష యూనిట్లను ఎగుమతి చేసి, ఇది తన కేటగిరీలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకుంది. హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా పెద్ద విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశం ఉంది.