Maruti Invicto : సేఫ్టీలో అదరగొట్టిన మారుతి.. ఇన్విక్టోకు 5-స్టార్ రేటింగ్

ఇన్విక్టోకు 5-స్టార్ రేటింగ్

Update: 2025-09-26 05:50 GMT

Maruti Invicto : సేఫ్టీ విషయంలో చాలా అపవాదులు ఎదుర్కొన్న మారుతి సుజుకి సంస్థ, ఇప్పుడు ఒక్కొక్కటిగా 5-స్టార్ రేటింగ్‌లను సాధిస్తూ తన ఇమేజ్‌ను మార్చుకుంటోంది. తాజాగా ప్రీమియం ఎంపీవీ మారుతి సుజుకి ఇన్విక్టో.. అడల్ట్, చైల్డ్ సేఫ్టీ రెండు విభాగాల్లోనూ 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ విజయంతో అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను అందించే మారుతి కార్ల జాబితాలో ఇన్విక్టో మూడో స్థానంలో చేరింది.

మారుతి సుజుకి ఇన్విక్టో భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో అంచనాలకు మించి అద్భుతమైన పనితీరును కనబరిచింది. పెద్దల భద్రత విషయంలో మొత్తం 32 పాయింట్లకు గాను ఏకంగా 30.43 పాయింట్లు సాధించి తన పటిష్టతను నిరూపించుకుంది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్‌లో కూడా కారు చాలా స్ట్రాంగ్‌గా నిలిచింది, అంటే ముందు భాగం నుండి ఢీకొన్నప్పుడు ప్రయాణికులకు మంచి రక్షణ లభిస్తుంది. ఇక పిల్లల భద్రత విభాగంలో అయితే, 49 పాయింట్లకు గాను భారీగా 45 పాయింట్లు సాధించి అత్యుత్తమ రేటింగ్‌ను పొందింది.

ముఖ్యంగా ISOFIX మౌంట్స్, i-Size చైల్డ్ సీట్ అనుకూలత ఉండటం వల్ల డైనమిక్ టెస్ట్‌లో ఇన్విక్టో 24/24 పూర్తి పాయింట్లను సాధించింది. ఈ టెస్ట్ సమయంలో ఆల్ఫా+ 7-సీటర్ మరియు జెటా+ 8-సీటర్ మోడళ్లను పరీక్షించారు. అంతేకాకుండా, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో కూడా ఇన్విక్టో పూర్తి పాయింట్లను సాధించడం గమనార్హం.

ప్రయాణికులకు పూర్తి భద్రతను అందించడానికి మారుతి సుజుకి ఈ ఇన్విక్టో MPVలో నెక్సా సేఫ్టీ షీల్డ్ ప్యాకేజీని స్టాండర్డ్‌గా అందించింది. ఇందులో అనేక ముఖ్యమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఎయిర్‌బ్యాగ్‌లు విషయానికి వస్తే, 6 ఎయిర్‌బ్యాగ్స్‌ అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇది ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు అన్ని వైపుల నుండి రక్షణ కల్పిస్తుంది. కంట్రోల్ సిస్టమ్స్ లో భాగంగా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కారు అదుపు తప్పకుండ, వాలుగా ఉన్న ప్రదేశాల్లో సురక్షితంగా ప్రయాణించడానికి సహాయపడతాయి.

అన్ని సీట్ బెల్ట్‌లు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లుగా అందించారు. ఇది ప్రతి ప్రయాణికుడికి మెరుగైన భద్రతను ఇస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ చాలా పటిష్టంగా ఉంది. ఇందులో ఆల్-డిస్క్ బ్రేక్స్, ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటివి ఉన్నాయి. ఇక అడ్వాన్సుడ్ ఫీచర్ల విషయానికి వస్తే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, పార్కింగ్‌ను సులభతరం చేసే 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం సుజుకి కనెక్ట్ ద్వారా e-Call ఫీచర్‌ను కూడా అందించారు.

మారుతి సుజుకి ఇప్పుడు భద్రత విషయంలో కూడా తన సత్తా చాటుతోంది. భారత్ NCAP లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన మూడో కారుగా ఇన్విక్టో నిలిచింది. దీనికి ముందు మారుతి మోడల్స్ అయిన డిజైర్, విక్టోరిస్ ఇప్పటికే ఈ అత్యున్నత రేటింగ్‌ను దక్కించుకున్నాయి. ఇది మారుతి భద్రతా ప్రమాణాలను పెంచుతోందని స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం, మారుతి సుజుకి తన 15 మోడల్స్‌లోని 157 వేరియంట్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తోంది. ఈ జాబితాలో ఆల్టో K10, వ్యాగనార్, బాలెనో వంటి హ్యాచ్‌బ్యాక్‌లు, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఫ్రాంక్స్ వంటి ఎస్‌యూవీలు; ఎక్స్‌ఎల్6, ఎర్టిగా, ఇన్విక్టో వంటి ఎంపీవీలు ఉన్నాయి. ఇది మారుతి ఇప్పుడు తమ వినియోగదారులకు మైలేజ్‌తో పాటు అత్యుత్తమ భద్రతను కూడా అందిస్తోందని రుజువు చేస్తుంది.

Tags:    

Similar News