Maruti Suzuki: 2031 నాటికి 63 లక్షల కార్ల విక్రయాలు.. ఆటో రంగానికి జీఎస్టీ 2.0 తెచ్చిన బూస్ట్ ఇదే
జీఎస్టీ 2.0 తెచ్చిన బూస్ట్ ఇదే
Maruti Suzuki: పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధ వాతావరణం, ఇరాన్ చుట్టూ అల్లుకున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊగిసలాడుతోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా భారత్‌లో వ్యాపారాలు పుంజుకోవడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పన్ను సంస్కరణలు తోడ్పడ్డాయి. మారుతి సుజుకి ఇండియా వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆర్ సీ భార్గవ్, జీఎస్టీ విధానంలో చేసిన మార్పులు కేవలం ఆటోమొబైల్ రంగానికే కాకుండా అనేక ఇతర పరిశ్రమల ఎదుగుదలకు తోడ్పడ్డాయని వివరించారు. ఈ పన్ను సంస్కరణలు అమల్లోకి రాకపోయి ఉంటే సంక్షోభ సమయంలో పన్ను రాబడులు నిలకడగా ఉండేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు.
2031 నాటికి 63 లక్షల కార్ల విక్రయాల మార్క్
భారత కార్ల మార్కెట్ భవిష్యత్తుపై భార్గవ్ అత్యంత సానుకూల అంచనాలను వ్యక్తపరిచారు. 2031 నాటికి దేశంలో ఏటా దాదాపు 61 లక్షల నుంచి 63 లక్షల కార్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో జీఎస్టీ పన్నుల నిర్మాణంలో చేసిన మార్పుల వల్ల చిన్న కార్ల విక్రయాలు మళ్లీ పుంజుకోనున్నాయి. రాబోయే రోజుల్లో సాధారణ కుటుంబాలు చిన్న కార్ల కొనుగోలు వైపు మొగ్గు చూపుతారని, ఇది ఆటో రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉత్పత్తి సామర్థ్యాన్ని 36.5 లక్షల యూనిట్లకు పెంపు
భవిష్యత్తులో రాబోయే భారీ డిమాండ్‌ను తట్టుకోవడానికి మారుతి సుజుకి తన ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఏటా 29 లక్షల కార్లను తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2030-31 నాటికి ఈ సామర్థ్యాన్ని వార్షికంగా 36.5 లక్షల కార్లకు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. హర్యానాలోని ఖార్‌ఖోడా ప్లాంట్‌లో ఇప్పటికే రెండు ప్రొడక్షన్ లైన్లు ప్రారంభం కాగా, మూడో లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ కేంద్రం
గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో కొత్త ప్రొడక్షన్ లైన్ అందుబాటులోకి రావడంతో అక్కడ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 10 లక్షల కార్లకు చేరింది. సుజుకి సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్ ప్లాంట్లలో ఇదే అత్యంత పెద్దది కావడం విశేషం. దీనికి అదనంగా గుజరాత్‌లోని సానంద్ వద్ద రూ. 35,000 కోట్ల అంచనా వ్యయంతో కొత్త ఫ్యాక్టరీ పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ కూడా ఏటా 10 లక్షల కార్ల తయారీ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేస్తేనే దేశం గ్లోబల్ పవర్‌గా ఎదుగుతుందని భార్గవ్ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.