Maruti Suzuki: భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవం దిశగా మారుతి సుజుకి అడుగులు వేస్తోంది. దేశంలో సరైన ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ అందుబాటులోకి రాగానే చిన్న ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తామని కంపెనీ సిఈఓ హిసాషి టకేవుచి స్పష్టం చేశారు. మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటు ధరలో ఈవీలను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన పట్టును బలపరుచుకునేందుకు మారుతి సుజుకి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. కేవలం కార్లను అమ్మడం మాత్రమే కాకుండా, వినియోగదారులకు ఛార్జింగ్ ఇబ్బందులు లేకుండా చూడటమే తమ ప్రాధాన్యమని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ-విటారా మోడల్‌తో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలోకి అడుగుపెట్టిన మారుతి, గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తోంది. చవకైన చిన్న ఈవీలు రావాలంటే ముందుగా దేశవ్యాప్తంగా మౌలిక వసతులు పెరగాలని యాజమాన్యం భావిస్తోంది.

లక్ష ఛార్జింగ్ పాయింట్ల భారీ లక్ష్యం

ఈవీ వినియోగాన్ని సామాన్యులకు సైతం దగ్గర చేయాలనే ఉద్దేశంతో మారుతి సుజుకి ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ దశాబ్దం పూర్తయ్యే నాటికి దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 13 ప్రముఖ ఛార్జింగ్ ఆపరేటర్ కంపెనీలతో చేతులు కలిపింది. ఇప్పటికే 1,100 కంటే ఎక్కువ నగరాల్లో 2,000 ఎక్స్‌క్లూజివ్ ఛార్జింగ్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రధాన జాతీయ రహదారులు, దేశంలోని టాప్ 100 నగరాల్లో ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఛార్జర్లు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది.

ఒకే ప్లాంట్‌లో అన్ని రకాల వాహనాలు

ఎలక్ట్రిక్ రంగానికే పరిమితం కాకుండా పెట్రోల్, హైబ్రిడ్, సిఎన్‌జి వాహనాలపై కూడా మారుతి తన పెట్టుబడులను కొనసాగిస్తోంది. భవిష్యత్తులో బయో-గ్యాస్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ఐసిఈ ఇంజిన్ టెక్నాలజీని పక్కన పెట్టడం లేదు. సరికొత్త ప్లాంట్లలో ఒకే ప్రొడక్షన్ లైన్ ద్వారా ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సిఎన్‌జి కార్లను తయారు చేసే సదుపాయాన్ని రూపొందిస్తున్నారు. దీనివల్ల మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఏ మోడల్ ఉత్పత్తిలనైనా వేగంగా మార్చుకునే వీలు కలుగుతుంది.

ఎగుమతుల్లో సంచలనం.. రూ.77,500 కోట్ల భారీ పెట్టుబడి

భారత్ నుంచి ఎలక్ట్రిక్ కార్లను ఎగుమతి చేయడంలో మారుతి సుజుకి అగ్రస్థానంలో నిలుస్తోంది. దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న మొత్తం ఈవీల్లో 90 శాతం వాటా ఈ కంపెనీదే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తూ జపాన్, యూరప్ మార్కెట్లలో తన సత్తా చాటుతోంది. సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఉత్పత్తుల తయారీ కోసం 2027 నుంచి 2031 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ.77,500 కోట్ల మూలధన వ్యయాన్ని వెచ్చించబోతోంది. జపాన్ సుజుకి మోటార్‌తో కలిసి అధునాతన డిజిటల్ టెక్నాలజీ ద్వారా కొత్త కార్లను వేగంగా రోడ్లపైకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.

Tags: