Maruti Dzire: 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో మారుతి డిజైర్ జోరు.. 35 లక్షల మైలురాయి దాటిన పాపులర్ సెడాన్
35 లక్షల మైలురాయి దాటిన పాపులర్ సెడాన్
Maruti Dzire: భారత ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ సెడాన్ కార్ మారుతి డిజైర్ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ కారు భారతీయ మార్కెట్లో ఏకంగా 35 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని విజయవంతంగా దాటేసింది. 2008లో తొలిసారిగా మార్కెట్లోకి అడుగుపెట్టిన డిజైర్, సుమారు 18 సంవత్సరాల 9 నెలల కాలంలో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ అద్భుత రికార్డుతో మారుతి సుజుకి నుంచి 35 లక్షల యూనిట్ల ప్రొడక్షన్ దాటిన నాలుగో కారుగా డిజైర్ నిలిచింది. అంతకుముందు ఆల్టో, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్ కార్లు మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నాయి.
మనేసర్ ప్లాంట్ వేదికగా ప్రొడక్షన్
హర్యానాలోని మనేసర్ తయారీ ప్లాంట్‌లో ఈ పాపులర్ సెడాన్ కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) నివేదికల ప్రకారం డిజైర్ ఇప్పటికీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్యాసింజర్ సెడాన్ కార్లలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2015 ఏప్రిల్ నాటికి తొలి 10 లక్షల యూనిట్ల ఉత్పత్తిని చేరుకున్న ఈ కారు, 2019 జూన్‌లో 20 లక్షలు, 2024 డిసెంబర్ నాటికి 30 లక్షల మార్కును తాకింది. మొదటి 10 లక్షల కార్ల తయారీకి 7 ఏళ్ల సమయం పట్టగా, చివరి 10 లక్షల వాహనాలను కేవలం 4 ఏళ్ల 4 నెలల వ్యవధిలోనే తయారు చేయడం విశేషం.
5-స్టార్ సేఫ్టీ రేటింగ్
2008లో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ డిజైర్ కార్ నాలుగు మోడల్ అప్డేట్లను (తరం మోడళ్లు) మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన డిజైన్, ప్రయాణికులకు సౌకర్యవంతమైన కేబిన్, సులభమైన డ్రైవింగ్ అనుభవం వల్ల దాదాపు 19 ఏళ్లుగా సెడాన్ విభాగంలో ఇది తిరుగులేని రాజాగా ఏలుతోంది. ఇటీవల నూతనంగా లాంచ్ చేసిన మోడల్లో డ్యూయల్-టోన్ ఇంటీరియర్, సరికొత్త ఎక్స్టీరియర్ హంగులను అమర్చారు. అంతేకాకుండా భారత్ NCAP క్రాష్ టెస్టింగ్‌లో ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్న తొలి సెడాన్‌గా ఇది నిలిచింది.
అద్భుతమైన మైలేజ్
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇటీవల ఈ కారులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన S-CNG మోడల్‌ను ప్రవేశపెట్టారు. ఈ సిఎన్జి వెర్షన్ ఏకంగా కేజీకి 36.47 కిలోమీటర్ల భారీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ప్రఖ్యాత సంస్థ జేటో డైనమిక్స్ ఈ కారును భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే సెడాన్‌గా ధృవీకరించింది. తక్కువ రన్నింగ్ కాస్ట్ కోరుకునే ప్రైవేట్, టాక్సీ వినియోగదారులకు ఈ మైలేజ్ ఎంతో ఉపయోగపడుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ భాగా ప్రాచుర్యం
మారుతి డిజైర్ క్రేజ్ కేవలం భారత్‌కే పరిమితం కాకుండా విదేశీ మార్కెట్లలోనూ విస్తరించింది. గత ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి నుంచి విదేశాలకు అత్యధికంగా ఎగుమతి అయిన టాప్-5 కార్లలో డిజైర్ స్థానం సంపాదించుకుంది. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, మైలేజ్, అందుబాటు ధరల కలబోతగా వచ్చిన ఈ కారు భారతీయ కార్ లవర్ల మనస్సుల్లో చెరగని ముద్ర వేసింది. భవిష్యత్తులో కూడా సెడాన్ మార్కెట్లో ఈ కారు ఆధిపత్యం ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది.