Upcoming Cars: నవంబర్ మాసంలో ఆటోమొబైల్ లవర్లను అలరించేందుకు ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు సిద్ధమయ్యాయి. పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల నుంచి అల్ట్రా లగ్జరీ ఎంపీవీల వరకు అనేక ఆకర్షణీయమైన కార్లు ఈ నెలలో భారత మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్నాయి. వెహికల్ లవర్లను దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆ టాప్ 5 కార్ల వివరాలు తెలుసుకుందాం.

1. మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ ఎలక్ట్రిక్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ నవంబర్ 4న భారత మార్కెట్లో తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జీఎల్సీ ఎలక్ట్రిక్ మోడల్‌ను లాంచ్ చేయబోతోంది. ప్రారంభంలో GLC 400 4MATIC వేరియంట్‌లో రానున్న ఈ వాహనంలో 94kWh భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. రెండు ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో 490hp పవర్, 800Nm టాప్ టార్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 715 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 4.3 సెకన్లలోనే 100 కిమీ స్పీడ్ అందుకునే ఈ కారులో 39.1 అంగుళాల MBUX హైపర్‌స్క్రీన్, బెర్మెస్టర్ 4D సౌండ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ అడాస్ ఫీచర్లు ఉన్నాయి. దీని అంచనా ధర రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు ఉండవచ్చు.

2. డెంజా జెడ్9 జిటి

చైనాకు చెందిన ప్రముఖ ఈవి సంస్థ BYD లగ్జరీ బ్రాండ్ డెంజా వంబర్ 13న భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ బ్రాండ్ నుంచి వస్తున్న డెంజా జెడ్9 జిటి ఎలక్ట్రిక్ కారులో ఏకంగా 122.5kWh పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్ ఉంది. సింగిల్ ఛార్జ్‌పై ఇది 600 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మూడు ఎలక్ట్రిక్ మోటార్ల కాంబినేషన్‌తో ఏకంగా 1,156hp పవర్, 1,210Nm టాప్ టార్క్ విడుదల చేసే ఈ కారు, కేవలం 2.7 సెకన్లలోనే 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకోవడం విశేషం. కేబిన్ లోపల పలు డిస్‌ప్లే స్క్రీన్లు, 20 స్పీకర్ల డెవియాలెట్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ మెసేజింగ్ సీట్లు వంటి హంగులు ఉన్నాయి. దీని ధర రూ.1.20 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉంది.

3. డెంజా డి9 లగ్జరీ ఎంపీవీ

డెంజా సంస్థ జెడ్9 జిటి తో పాటు డెంజా డి9 పేరుతో ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీ కారును కూడా భారత్‌లో ప్రవేశపెట్టనుంది. 7 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ వాహనంలో 103.36kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 520 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మార్కెట్లో ఎంజీ M9, టయోటా వెల్‌ఫైర్ మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. రెండో వరుసలో కూర్చునే ప్రయాణికుల కోసం హీటింగ్, వెంటిలేషన్, మెసేజ్ సదుపాయాలు ఉన్న కెప్టెన్ సీట్లను అందించారు. 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, 14 స్పీకర్ల డైనోఆడియో సౌండ్ సిస్టమ్, లెవెల్-2 అడాస్ టెక్నాలజీ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కారు ధర రూ.80 లక్షల నుంచి రూ.1.10 కోట్ల వరకు ఉండవచ్చు.

4. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్

భారతీయ కుటుంబాలు ఎంతో ఇష్టపడే టయోటా ఇన్నోవా హైక్రాస్ కొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో నవంబర్ 26న విడుదల కానుంది. ఈ కొత్త మోడల్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, స్లిమ్ హెడ్‌లాంప్స్, మార్చిన బంపర్లు, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. లోపలి క్యాబిన్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, కొత్త అపోల్స్టరీ రానున్నాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అత్యంత ప్రధానమైన మార్పు ఏమిటంటే 2.0 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌ను ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడిచేలా ఫ్లెక్స్-ఫ్యూయల్ సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. ఈ పాపులర్ ఎంపీవీ అంచనా ధర రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఉండవచ్చు.

5. న్యూ మిని కూపర్ ఎస్ఈ

ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కార్ల తయారీ సంస్థ మిని తన రెండో తరం ఎలక్ట్రిక్ మోడల్ కూపర్ ఎస్ఈను నవంబర్ 27న భారత్‌లో విడుదల చేయబోతోంది. ప్రత్యేకమైన పాల్ స్మిత్ ఎడిషన్ రూపంలో కూడా ఇది మార్కెట్లోకి రానుంది. ఇందులో 54.2kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇక్కడున్న ఎలక్ట్రిక్ మోటార్ 218hp పవర్, 330Nm టాప్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై డబ్ల్యూఎల్టీపీ సైకిల్ ప్రకారం 402 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కేవలం 6.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకునేలా దీనిని రూపొందించారు. కొత్త అష్టభుజి గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, సరికొత్త అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు ఎంతో స్పోర్టీగా కనిపిస్తుంది.

Tags: