Maruti Dzire: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ మారుతి సుజుకి డిజైర్ తన హవాను కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 2026 విక్రయాల గణాంకాల ప్రకారం ఈ సెగ్మెంట్‌లో మారుతి డిజైర్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఒక్క నెలలోనే ఏకంగా 17,754 మంది కొత్త కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేశారు. వార్షిక ప్రాతిపదికన అమ్మకాల్లో 11 శాతం స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ, సెడాన్ కేటగిరీలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా ఇది మొదటి స్థానంలో నిలిచింది.

ప్రీమియం డిజైన్, ఆకర్షణీయమైన లుక్

కొత్త మారుతి డిజైర్ డిజైన్ పరంగా చాలా ప్రీమియం, మోడ్రన్ లుక్‌తో కనిపిస్తుంది. ముందు భాగంలో వెడల్పాటి గ్రిల్, కొత్త డిజైన్ కలిగిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, డిఆర్‌ఎల్‌లు అమర్చారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు ఇది ప్రత్యేకమైన రాయల్ లుక్ ఇస్తుంది. వైపుల నుంచి స్పోర్టీ లుక్‌తో కనిపిస్తూ, వెనుక భాగంలో ఇచ్చిన స్టైలిష్ సి-షేప్డ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఈ కారుకు మరింత అందాన్ని తీసుకువచ్చాయి.

అద్భుతమైన మైలేజ్, కొత్త జెడ్-సిరీస్ ఇంజిన్

డిజైర్‌లో 1.2-లీటర్ కొత్త జెడ్-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది 80bhp పవర్, 112Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే ఈ కారు లీటర్ పెట్రోల్‌కు 25 నుంచి 26 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. ఇక సిఎన్‌జి మోడల్‌లో కేజీకి దాదాపు 35 కిలోమీటర్ల మైలేజ్ లభిస్తోంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఇది అద్భుతమైన ఎంపికగా మారింది.

ఫస్ట్ టైమ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హైటెక్ ఫీచర్లు

కారు ఇంటీరియర్ ఆకట్టుకునేలా ఉంది. డిజైర్ మోడల్‌లో మొదటిసారిగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ పరిచయం చేశారు. దీనితో పాటు 9-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఇరుకైన ప్రాంతాల్లో పార్కింగ్ చేయడానికి ఉపయోగపడే 360-డిగ్రీ కెమెరా వంటి సౌకర్యాలు ఉన్నాయి. వెనుక సీటు ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏసీ వెంట్స్, ఆర్మ్‌రెస్ట్ అమర్చడం వల్ల సుదీర్ఘ ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి.

5-స్టార్ సేఫ్టీ రేటింగ్, వేరియంట్ల ధరలు

భద్రత విషయంలో ఈ కొత్త డిజైర్ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పింది. Global NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి కీలక భద్రతా ఫీచర్లు ప్రామాణికంగా లభిస్తాయి. కొత్త డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.30 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.54 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎల్‌ఎక్స్‌ఐ, విఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్‌ఐ, జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యమవుతోంది.

Tags: