Maruti Suzuki : మారుతి సుజుకి అదిరిపోయే ప్లాన్.. ఇక మీ ఆఫీసు దగ్గరికే సర్వీస్ సెంటర్

ఇక మీ ఆఫీసు దగ్గరికే సర్వీస్ సెంటర్

Update: 2026-03-30 11:06 GMT

Maruti Suzuki : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన కస్టమర్ల కోసం ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. కారు సర్వీసింగ్ కోసం గంటల తరబడి వర్క్‌షాపుల చుట్టూ తిరిగే పని లేకుండా, మీ ఆఫీసు దగ్గరికే సర్వీస్ సెంటర్‌ను తీసుకువచ్చే క్విక్‌స్టాప్ సేవలను ప్రారంభించింది. సాధారణంగా కారు సర్వీసింగ్ చేయించాలంటే పెద్ద వర్క్‌షాప్‌కు వెళ్లాలి, అక్కడ క్యూలో ఉండాలి. కానీ, మారుతి సుజుకి ప్రవేశపెట్టిన క్విక్‌స్టాప్ సెంటర్లు దీనికి భిన్నంగా ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా రూపొందించిన చిన్న కంటైనర్ ఆధారిత సర్వీస్ యూనిట్లు. వీటిని పెద్ద పెద్ద ఐటీ పార్కులు, ఆఫీసు క్యాంపస్‌లు, విమానాశ్రయాలు, కార్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కారుకు సంబంధించిన రెగ్యులర్ సర్వీసింగ్, చిన్నపాటి రిపేర్లను చాలా వేగంగా పూర్తి చేస్తారు.

హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ప్రారంభం

ఈ సరికొత్త ప్రాజెక్టును మారుతి సుజుకి ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికన ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ-NCR, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, బాగ్డోగ్రా, కాలికట్, సూరత్ వంటి నగరాల్లో మొదటి విడతగా 10 క్విక్‌స్టాప్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే ఈ సేవలను అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలని కంపెనీ భావిస్తోంది.

పర్యావరణ హితం.. నీటి పొదుపు

క్విక్‌స్టాప్ సెంటర్లు కేవలం సర్వీసింగ్ మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణకు కూడా పెద్దపీట వేస్తున్నాయి. ఇక్కడ వాటర్-లెస్ కార్ వాష్ సేవలను అందిస్తున్నారు. అంటే కారును శుభ్రం చేయడానికి నీటిని వృథా చేయకుండా ప్రత్యేక టెక్నాలజీని వాడుతున్నారు. అలాగే, సర్వీసింగ్ కోసం వాడే పరికరాలన్నీ బ్యాటరీతో నడిచేవే కావడం విశేషం. దీనివల్ల ఇంధనం, నీరు రెండు ఆదా అవుతాయి.

తక్కువ ఖర్చు.. ఎక్కువ సౌకర్యం

ఈ కంటైనర్ మోడల్ సర్వీస్ సెంటర్లను నిర్మించడానికి తక్కువ ఖర్చు అవుతుంది మరియు తక్కువ సమయంలోనే వీటిని సిద్ధం చేయవచ్చు. మారుతి సుజుకి తన డీలర్ నెట్‌వర్క్, కార్పొరేట్ భాగస్వాములతో కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తోంది. దీనివల్ల కస్టమర్లకు తమ ఇంటికి లేదా ఆఫీసుకి సమీపంలోనే నాణ్యమైన సర్వీసింగ్ లభిస్తుంది.

బిజీ లైఫ్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్

మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, CEO హిసాషి టేకుచి మాట్లాడుతూ.. "నేటి కాలంలో ప్రజలకు సమయం చాలా విలువైనది. ఆఫీసుకి వెళ్లే వ్యక్తి ఉదయం తన కారును క్విక్‌స్టాప్ సెంటర్‌లో ఇచ్చి, సాయంత్రం పని ముగించుకుని తిరిగి వెళ్లేటప్పుడు సర్వీసింగ్ పూర్తయిన కారును తీసుకువెళ్లవచ్చు. కస్టమర్లకు మరింత దగ్గరగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ సేవలను ప్రారంభించాం" అని తెలిపారు.

Tags:    

Similar News