MG 4X Electric SUV : ఎంజీ 4ఎక్స్ అదిరిపోయే ఎంట్రీ.. జెడ్ఎస్ ఈవీ స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ సునామీ
జెడ్ఎస్ ఈవీ స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ సునామీ
MG 4X Electric SUV : భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో జెఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన స్థానాన్ని రోజురోజుకూ పదిలం చేసుకుంటోంది. ముఖ్యంగా విండ్సర్ ఈవీ సాధించిన అఖండ విజయం ఈ సంస్థకు కొత్త ఊపిరి పోసింది. వినూత్నమైన బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ ప్లాన్ వల్ల సామాన్యులకు కూడా ఎలక్ట్రిక్ కారు కొనడం సులభమైంది. అయితే, ఎంజీ సంస్థకు చెందిన పాత మోడల్స్ అయిన కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో, 2027 నాటికి జెడ్ఎస్ ఈవీ, ఆస్టర్ స్థానంలో సరికొత్త మోడళ్లను తీసుకురావాలని ఎంజీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన ఎంజీ 4ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వచ్చే నెలలో బీజింగ్‌లో జరగనున్న ఆటో చైనా షోలో గ్లోబల్ డెబ్యూ చేయనున్న ఈ కారును, ఎంజీ సంస్థ ప్రపంచానికి పరిచయం చేసింది. చాలా కాలంగా జెడ్ఎస్ ఈవీకి ప్రత్యామ్నాయంగా ఎంజీ ES5 వస్తుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు ఎంజీ 4ఎక్స్ రేసులోకి రావడం ఆసక్తికరంగా మారింది. దీని కొలతల విషయానికి వస్తే, 4,395 మి.మీ పొడవు, 1,842 మి.మీ వెడల్పుతో ఉండటంతో ఇది బీవైడీ అట్టో 2కి గట్టి పోటీ ఇవ్వనుంది. ఎంజీ 4 ఫ్యామిలీకి చెందిన ఈ కారు, తన తోటి మోడల్స్ అయిన ఎంజీ S5, ES5 ల కంటే కాస్త తక్కువ విభాగంలో ఉన్నప్పటికీ, ప్రీమియం ఫీచర్లలో ఏమాత్రం తగ్గడం లేదు.
డిజైన్ పరంగా ఎంజీ 4ఎక్స్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ముందు భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్ బార్, స్టైలిష్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, స్పోర్టీ బంపర్‌తో గంభీరంగా కనిపిస్తోంది. సైడ్ నుంచి చూస్తే ఇది ఒక విలాసవంతమైన క్రాస్ఓవర్ ఎస్‌యూవీని తలపిస్తుంది. డ్యూయల్-టోన్ మెషిన్డ్ అలాయ్ వీల్స్, క్రోమ్ విండో లైన్, వెనుక వైపు ఉన్న కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ దీనికి మరింత రాజసాన్ని తెచ్చిపెట్టాయి. లోపల ఇంటీరియర్ గురించి కంపెనీ ఇంకా వివరాలు వెల్లడించనప్పటికీ, అది చాలా హైటెక్‌గా ఉంటుందని మార్కెట్ వర్గాల సమాచారం.
సాంకేతికపరంగా ఈ కారులో అత్యంత సురక్షితమైన సెమీ-సాలిడ్-స్టేట్ బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. సుమారు 53.95 kWh సామర్థ్యం కలిగిన ఈ బ్యాటరీ, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 510 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. ప్రారంభంలో ఇది సింగిల్ మోటార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ వెర్షన్ లో అందుబాటులోకి రానుంది. ఎంజీ సంస్థ భారత్‌లో దీని లాంచ్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రస్తుతం ఉన్న జెడ్ఎస్ ఈవీ రేంజ్, పరిమాణానికి ఇది సరిగ్గా సరిపోతుండటంతో, త్వరలోనే ఇది మన దేశంలో జెడ్ఎస్ ఈవీకి వారసుడిగా అడుగుపెట్టడం ఖాయమనిపిస్తోంది.