MG Motor : ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 1,100 కిమీ .. ఈ ఏడాది ఎంజీ నుంచి 4 సరికొత్త ఎస్‌యూవీలు
ఈ ఏడాది ఎంజీ నుంచి 4 సరికొత్త ఎస్‌యూవీలు
MG Motor : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఈ ఏడాది (2026) భారత మార్కెట్లో తన దూకుడును పెంచేందుకు సిద్ధమైంది. కంపెనీ తన ఫైవ్ ఇయర్ ప్లాన్‌లో భాగంగా మొత్తం నాలుగు సరికొత్త ఎస్‌యూవీలను విడుదల చేయబోతోంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. భారత్‌లో తొలిసారిగా ఒక మాస్ మార్కెట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) ఎస్‌యూవీని ఎంజీ పరిచయం చేయబోతోంది. ఈ కార్ల ద్వారా ఎంజీ తన అమ్మకాల్లో 75 శాతం వాటాను న్యూ ఎనర్జీ వెహికల్స్ నుంచే సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
1. ఎంజీ మేజెస్టర్
ఇది ఎంజీకి ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా నిలవనుంది. టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీనిచ్చేలా దీనిని రూపొందించారు. రూ. 41,000 టోకెన్ అమౌంట్‌తో ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. ఏప్రిల్ 2026లో ఇది అధికారికంగా విక్రయానికి రానుంది. ఇందులో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 215 bhp పవర్, 478 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. ఈ కారు పొడవు 5 మీటర్ల కంటే ఎక్కువ (5,046 మిమీ). ఇది షార్ప్, సావీ, సావీ 4X4 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. 12.3 ఇంచుల ఫ్లోటింగ్ స్క్రీన్, 12 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS వంటి హైటెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
2. ఎంజీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ (MG 520)
కోడ్ నేమ్ 520తో వస్తున్న ఈ కారు భారత మార్కెట్లో గేమ్ ఛేంజర్ కానుంది. ఇది చైనాలో విజయవంతమైన వులింగ్ స్టార్‌లైట్ 560 మోడల్ ఆధారంగా రూపొందుతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఎలక్ట్రిక్, పెట్రోల్ కలిపి వాడితే ఏకంగా 1,100 కిలోమీటర్ల కంబైన్డ్ రేంజ్ ఇస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 100 కి.మీ ప్రయాణించవచ్చు. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు 20.5 kWh బ్యాటరీ ప్యాక్, పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ జత చేయబడ్డాయి. ఇది ప్రధానంగా మహీంద్రా XUV 7XO, టాటా సఫారి వంటి మోడళ్లకు సవాల్ విసరనుంది. దీనిని 5, 7 సీటర్ల ఆప్షన్లలో తీసుకురానున్నారు.
3. ఇతర మోడళ్లు (MG S5 EV, MG Eksion)
రాబోయే నాలుగు మోడళ్లలో ఒకటి ఎంజీ S5 ఈవీ అనే ఎలక్ట్రిక్ కారు అని తెలుస్తోంది. ఇది ప్రస్తుత ZS ఈవీ కంటే పై సెగ్మెంట్‌లో ఉండే అవకాశం ఉంది. మరొకటి MG Eksion పేరుతో ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్ లేదా హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని మార్కెట్ వర్గాల అంచనా. ఈ నాలుగు మోడళ్లలో ఒకదానిని ఎంజీ తన ప్రీమియం నెట్‌వర్క్ ఎంజీ సెలెక్ట్ ద్వారా విక్రయించనుంది.