Maruti Suzuki Exports : మిడిల్ ఈస్ట్ లో చిచ్చు.. మారుతికి మాత్రం రికార్డు సేల్స్

మారుతికి మాత్రం రికార్డు సేల్స్

Update: 2026-03-02 10:49 GMT

Maruti Suzuki Exports : పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ వ్యాపారాలపై, ముఖ్యంగా భారత ఆటోమొబైల్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశీ కార్ల దిగ్గజం మారుతి సుజుకి ఇండియా ఈ విషయంలో ఊరటనిచ్చే వార్త చెప్పింది. మిడిల్ ఈస్ట్ దేశాలకు తమ ఎగుమతులు పరిమితంగానే ఉన్నాయని, దీనివల్ల కంపెనీపై పడే ప్రభావం తక్కువగానే ఉంటుందని స్పష్టం చేసింది. యుద్ధం వల్ల షిప్పింగ్ మార్గాలు దెబ్బతిన్నా, మారుతి తన వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించడం వల్ల పెద్దగా నష్టం ఉండబోదని ధీమా వ్యక్తం చేసింది.

మారుతి సుజుకి కార్పొరేట్ అఫైర్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతీ ఇటీవల జరిగిన సేల్స్ కాల్‌లో కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చేస్తున్న మొత్తం ఎగుమతుల్లో మధ్య ప్రాచ్య దేశాల వాటా కేవలం 12.5 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. తాము ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, అయితే ఎగుమతుల కోసం తాము కేవలం ఒకే ప్రాంతంపై ఆధారపడటం లేదని పేర్కొన్నారు. మారుతి సుజుకి ప్రస్తుతం లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, యూరప్ వంటి దాదాపు 100 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. ఇలా విభిన్న మార్కెట్లలో తమ పోర్ట్‌ఫోలియోను సమతుల్యం చేసుకోవడం వల్ల భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నుంచి వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గిందని ఆయన వివరించారు.

అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. మారుతి సుజుకి ఎగుమతుల్లో రికార్డు వృద్ధిని సాధించింది. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి (FY26) వరకు కంపెనీ ఎగుమతులు ఏకంగా 33.75 శాతం పెరిగి 4,00,734 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 2,99,617 యూనిట్లుగా మాత్రమే ఉంది. అంటే మధ్య ప్రాచ్య దేశాలకు సుమారు 50,000 కార్లు పంపగా, మిగిలిన 3.5 లక్షల కార్లు ఇతర ఖండాలకు వెళ్లాయి. మరీ ముఖ్యంగా కంపెనీ నిర్దేశించుకున్న 4 లక్షల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని కేవలం 11 నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. మార్చి నెల ఎగుమతులు దీనికి అదనం కానున్నాయి. అలాగే మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా ఇప్పటికే 39 దేశాలకు ఎగుమతి అవుతోంది. జర్మనీ, నార్వే, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది.

కేవలం మారుతి మాత్రమే కాదు, హ్యుందాయ్ మోటార్ ఇండియా, నిస్సాన్ మోటార్ ఇండియా వంటి ఇతర పెద్ద కంపెనీలకు కూడా మిడిల్ ఈస్ట్ మార్కెట్ వాటా 10 నుంచి 15 శాతం లోపే ఉంది. హ్యుందాయ్ 80 దేశాలకు, నిస్సాన్ 65 దేశాలకు తమ వాహనాలను పంపుతున్నాయి. అయితే, యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మాత్రం షిప్పింగ్ ఛార్జీలు పెరగడం, ఇన్సూరెన్స్ ఖర్చులు భారం కావడం, చమురు ధరల పెరుగుదల వల్ల అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, మారుతి సుజుకి తన ఎగుమతుల వ్యూహాన్ని విభిన్న దేశాలకు విస్తరించడం వల్ల ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Tags:    

Similar News