Hybrid SUVs : లీటరుకు 30 కి.మీ మైలేజీ.. మార్కెట్లోకి వస్తున్న అదిరిపోయే 4 హైబ్రిడ్ కార్లు ఇవే
మార్కెట్లోకి వస్తున్న అదిరిపోయే 4 హైబ్రిడ్ కార్లు ఇవే
Hybrid SUVs : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కార్ల కంటే హైబ్రిడ్ కార్ల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ టెన్షన్ లేకుండా, పెట్రోల్ కార్ల కంటే రెట్టింపు మైలేజీని ఇచ్చే ఈ టెక్నాలజీ వైపు జనం మొగ్గు చూపుతున్నారు. దీన్ని గమనించిన మారుతి సుజుకి, టయోటా, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీలు తమ పాపులర్ మోడళ్లను సరికొత్త హైబ్రిడ్ అవతారంలో తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా లీటరుకు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లు రాబోతుండటం విశేషం.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
టయోటా తన పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ హైరైడర్‌ను సరికొత్త జనరేషన్ మోడల్‌గా తీసుకురాబోతోంది. ఇది 2026 ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారులో కేవలం డిజైన్ మార్పులే కాకుండా.. లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), భారీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇది ఇప్పుడున్న దానికంటే మరింత సురక్షితంగా, స్టైలిష్‌గా ఉండబోతోంది.
మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్
మారుతి సుజుకి తన స్టైలిష్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ను హైబ్రిడ్ వెర్షన్‌లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో మారుతి సొంతంగా తయారు చేసిన HEV సిరీస్ హైబ్రిడ్ టెక్నాలజీని వాడబోతున్నారు. 1.2 లీటర్ Z-సిరీస్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు లీటరుకు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుందని సమాచారం. 2026 మధ్యలో ఈ కారు భారత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో బెస్ట్ మైలేజీ కోరుకునే వారికి ఇది వరం లాంటిది.
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్
ఒకప్పుడు ఇండియాను ఏలిన డస్టర్ మళ్ళీ కొత్త అవతారంలో వస్తోంది. ఈసారి రెనో తన పవర్‌ఫుల్ E-Tech స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని ఇందులో ప్రవేశపెడుతోంది. 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ కారు.. సిటీ ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడుస్తుంది. దీనివల్ల పెట్రోల్ ఖర్చు భారీగా తగ్గుతుంది. 2026 దీపావళి నాటికి ఈ కారును లాంచ్ చేసేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది.
హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్
భారత్ లో ఎస్‌యూవీ అంటేనే క్రెటా అనే స్థాయికి వెళ్ళిన ఈ కారు కూడా ఇప్పుడు హైబ్రిడ్ బాట పట్టింది. 2027 నాటికి హ్యుందాయ్ క్రెటా నెక్స్ట్ జనరేషన్ మోడల్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. ధర సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో భారత్‌లోనే తయారు చేయాలని హ్యుందాయ్ నిర్ణయించింది. దీనివల్ల డీజిల్ కార్ల వాడకం తగ్గి, మైలేజీ ప్రియులకు కొత్త ఆప్షన్ దొరకనుంది.