Hyundai Elantra: పాత కారు కంటే మరింత పొడవు, వెడల్పు..కొత్త అవతారంలో హ్యుందాయ్ ఎలంట్రా
| హ్యుందాయ్ ఎలంట్రా
Hyundai Elantra: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ కారు ఎలంట్రా ఎనిమిదో జనరేషన్ మోడల్‌ను 2026 లాస్ ఏంజిల్స్ ఆటో షోలో ఘనంగా ఆవిష్కరించింది. కొత్త ఎలంట్రాను మునుపటి కంటే ఎంతో స్పోర్టీగా, మస్క్యులర్‌గా తీర్చిదిద్దారు. దీనిని కంపెనీ ఆర్ట్ ఆఫ్ స్టీల్ డిజైన్ థీమ్‌పై తయారు చేసింది. ముందు భాగంలో కొత్త గ్రిల్, H-ఎడ్జ్ లైటింగ్, సన్నని హెడ్‌లైట్లు, ఉబ్బెత్తు వీల్ ఆర్చ్‌లు, పదునైన బాడీ లైన్లతో కారు లుక్ అదిరిపోయేలా ఉంది. సైడ్ నుంచి చూస్తే పొడవైన బానెట్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వెనుక భాగంలో నిలువు టెయిల్ లైట్లు కారుకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. అమెరికా మార్కెట్లో పెట్రోల్ మోడల్ 2027లో, హైబ్రిడ్ మోడల్ 2028 మోడల్ ఇయర్ కింద రానున్నాయి.
వెనుక సీట్లోనూ భారీ స్పేస్
కొత్త ఎలంట్రా కేవలం లుక్ పరంగానే కాదు, పరిమాణంలోనూ పెరిగింది. దీని పొడవు 4,795 ఎంఎం, వెడల్పు 1,854 ఎంఎం, ఎత్తు 1,425 ఎంఎం కాగా వీల్‌బేస్ 2,751 ఎంఎంగా ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది 86 ఎంఎం ఎక్కువ పొడవు, 30 ఎంఎం ఎక్కువ వెడల్పు కలిగి ఉంది. వీల్‌బేస్ కూడా 30 ఎంఎం పెరగడంతో క్యాబిన్ లోపల విశాలమైన స్థలం లభిస్తోంది. వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికులకు 993 ఎంఎం లెగ్‌రూమ్, 958 ఎంఎం హెడ్‌రూమ్ దొరుకుతుంది. అంటే ఒక మిడ్-సైజ్ కారులో ఉండేంత స్థలం ఇందులో ఉంటుందని కంపెనీ చెబుతోంది.
12.9 అంగుళాల భారీ స్క్రీన్
కారు ఇంటీరియర్‌ను డ్రైవర్ సౌకర్యానికి అనుగుణంగా పూర్తిగా మార్చేశారు. డ్యాష్‌బోర్డ్‌పై ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ ఓఎస్ ఆధారిత ప్లియోస్ కనెక్ట్ సిస్టమ్‌తో కూడిన 12.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ఇందులో ఓటీఏ అప్‌డేట్లు, యాప్ డౌన్‌లోడ్లు, గ్లియో ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు బ్యాంగ్ అండ్ ఒలుఫ్‌సెన్ ఆడియో సిస్టమ్, డిజిటల్ కీ 2, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు, 100W యూఎస్‌బీ-సీ పోర్ట్ ఉన్నాయి. అలాగే అవసరమైన పనుల కోసం కొన్ని ఫిజికల్ బటన్లను కూడా అలాగే ఉంచారు.
22.5 కిలోమీటర్ల మైలేజీ లక్ష్యం
కొత్త ఎలంట్రా పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ మోడల్‌లో 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజిన్ ఉంటుంది, ఇది 145 bhp పవర్, 179 Nm టార్క్ ఇస్తుంది. IVT గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ మోడల్ దాదాపు 14.9 కిమీ మైలేజీ ఇస్తుందని అంచనా. ఇక హైబ్రిడ్ మోడల్‌లో 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు ఎలక్ట్రిక్ మోటార్ జతచేసి మొత్తం 153 bhp పవర్‌ను అందిస్తున్నారు. 1.49 kWh బ్యాటరీ, 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ హైబ్రిడ్ కారు సుమారు 22.5కిమీ మైలేజీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో స్మార్ట్ రీజెనరేటివ్ బ్రేకింగ్ 3.0, స్టే మోడ్ ఉన్నాయి. కారు పార్క్ చేసి ఉన్నప్పుడు పెట్రోల్ ఇంజిన్ స్టార్ట్ చేయకుండానే క్యాబిన్ ఫీచర్లను వాడుకోవడానికి స్టే మోడ్ ఉపయోగపడుతుంది.
స్మార్ట్‌సెన్స్‌తో కట్టుదిట్టమైన భద్రత
ప్రయాణికుల భద్రత కోసం కొత్త ఎలంట్రాలో అధునాతన హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ సేఫ్టీ టెక్నాలజీని అందించారు. ఇందులో ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్, బ్లైండ్-స్పాట్ అలర్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ లాంటి కీలక ADAS ఫీచర్లు ఉన్నాయి. అయితే కారు వేరియంట్లను బట్టి ఈ భద్రతా ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.