Tata Nexon: టాటా మోటార్స్ నుంచి నెక్సాన్ కొత్త జనరేషన్ మోడల్ రాబోతోంది. ఇప్పటికే ఈ SUV రోడ్లపై టెస్టింగ్‌లో కనిపించడంతో కారు ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. బయట డిజైన్ నుంచి లోపలి ఫీచర్ల వరకు పలు మార్పులు ఉండొచ్చని సమాచారం. ముఖ్యంగా 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్న అంచనాలతో ఈ కొత్త నెక్సాన్‌పై చర్చ మొదలైంది. అయితే కంపెనీ ఇంకా అధికారిక వివరాలు ప్రకటించలేదు. టెస్టింగ్‌లో కనిపించిన నెక్సాన్‌ను పూర్తిగా కవర్ చేయడంతో తుది డిజైన్ ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియడం లేదు. అయితే కొత్త మోడల్ ముందు భాగంలో గ్రిల్, బంపర్, లైటింగ్ సెటప్‌లో మార్పులు ఉండొచ్చని ఆటోమొబైల్ నివేదికలు చెబుతున్నాయి. ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్ కొనసాగించే అవకాశం ఉంది. వెనుక వైపు డిజైన్‌లోనూ మార్పులు కనిపించవచ్చని అంచనా.

కొత్త టెస్ట్ వాహనంలో భిన్నమైన అల్లాయ్ వీల్స్ కనిపించాయి. వెనుక చక్రాలకు డిస్క్ బ్రేకులు ఇచ్చినట్లు కూడా స్పై చిత్రాల్లో తెలుస్తోంది. ప్రస్తుత నెక్సాన్‌లో వెనుకవైపు డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. అయితే ఇవన్నీ టెస్టింగ్ వాహనంలో కనిపించిన అంశాలే. మార్కెట్లోకి వచ్చే తుది మోడల్‌లో మార్పులు ఉండొచ్చు.

కొత్త నెక్సాన్ క్యాబిన్‌లో కూడా కీలక మార్పులు ఉండనున్నాయి. టెస్టింగ్ సమయంలో కనిపించిన ఇంటీరియర్ చిత్రాల ప్రకారం.. డ్యాష్‌బోర్డ్‌పై రెండు వేర్వేరు డిజిటల్ స్క్రీన్లు ఉండొచ్చు. ఇందులో ఒకటి డ్రైవర్‌కు అవసరమైన సమాచారం చూపించే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కాగా, మరొకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌గా పనిచేస్తుంది. వీటికి కొత్త సాఫ్ట్‌వేర్, మెరుగైన కనెక్టెడ్ కార్ సదుపాయాలు అందించే అవకాశం ఉంది.

ఇక ఫీచర్ల విషయంలో పనోరమిక్ సన్‌రూఫ్, ముందు సీట్లకు వెంటిలేషన్, యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యాష్‌క్యామ్ వంటి సదుపాయాలు రావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. 360 డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉండొచ్చని అంచనా. అయితే వీటిలో ఏ ఫీచర్ ఏ వేరియంట్‌లో వస్తుందనే విషయంపై టాటా మోటార్స్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

కొత్త తరం నెక్సాన్‌లో మరో ముఖ్యమైన మార్పు ప్లాట్‌ఫామ్‌కు సంబంధించినది. ఇది టాటా మోటార్స్ ATLAS మాడ్యులర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే మరో నివేదిక ప్రకారం ప్రస్తుత X1 ప్లాట్‌ఫామ్‌ను భారీగా మార్పులు చేసి ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ATLAS ప్లాట్‌ఫామ్ పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వంటి విభిన్న ఇంజిన్‌ వ్యవస్థలకు అనుకూలంగా ఉండేలా రూపొందించినట్లు సమాచారం.

ఇంజిన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కొనసాగవచ్చని అంచనా. CNG మోడల్ కూడా అందుబాటులో ఉండొచ్చు. డీజిల్ వెర్షన్ విషయంలో మాత్రం స్పష్టత లేదు. టాటా సియెర్రాలో ఉపయోగిస్తున్న కొత్త Kryojet డీజిల్ ఇంజిన్‌ను నెక్సాన్‌లోనూ ఇవ్వవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుత డీజిల్ ఇంజిన్ కొనసాగుతుందా? కొత్త ఇంజిన్ వస్తుందా? అనేది కంపెనీ ప్రకటించాల్సి ఉంది. నెక్సాన్ EVకి కూడా కొత్త జనరేషన్ మార్పులు వచ్చే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ కొత్త జనరేషన్ మోడల్ 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ SUVకు హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజా, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO, స్కోడా కైలాక్ వంటి మోడళ్ల నుంచి పోటీ ఉంది. కొత్త డిజైన్, అప్‌డేట్ చేసిన క్యాబిన్, అదనపు టెక్నాలజీ ఫీచర్లతో నెక్సాన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాలని టాటా చూస్తున్నట్లు తెలుస్తోంది.

Tags: