New Petrol Rules 2026: వాహనదారులకు అలర్ట్.. 2026 ఏప్రిల్ నుంచి కొత్త పెట్రోల్.. మైలేజీ తగ్గుతుందా?

2026 ఏప్రిల్ నుంచి కొత్త పెట్రోల్.. మైలేజీ తగ్గుతుందా?

Update: 2026-02-27 11:55 GMT

New Petrol Rules 2026: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఒక కీలకమైన సమాచారాన్ని అందించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 95 RON కలిగిన ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను మాత్రమే విక్రయించాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 17న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలకు అనుగుణంగా గరిష్టంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను అమ్మాల్సి ఉంటుంది. ఈ కొత్త ఇంధనం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, విదేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించి దేశీయంగా రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే, ఈ E20 పెట్రోల్ గురించి విన్న సామాన్య వాహనదారుల మనసులో ఒకటే అనుమానం.. అదే మైలేజీ. అసలు ఈ E20 పెట్రోల్ అంటే ఏంటి? దీనివల్ల బండి మైలేజీ తగ్గుతుందా? అనే ప్రశ్నలు అందరినీ తొలుస్తున్నాయి. సరళంగా చెప్పాలంటే, E20 పెట్రోల్‌లో 80 శాతం సాధారణ పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంటుంది. ఈ ఇథనాల్‌ను చెరకు లేదా మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారు చేస్తారు. ఇది పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన ఇంధనం అనడంలో సందేహం లేదు. కానీ, ఆటోమొబైల్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో క్యాలరీఫిక్ వాల్యూ కొంత తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇంజిన్ నుంచి వచ్చే శక్తి స్వల్పంగా తగ్గే అవకాశం ఉండటంతో, వాహనం మైలేజీలో 3 నుంచి 7 శాతం వరకు తగ్గుదల కనిపించవచ్చు.

కానీ, ఈ మైలేజీ తగ్గుదల అనేది అన్ని వాహనాల్లో ఒకేలా ఉండదు. 2023 తర్వాత తయారైన కార్లు, బైక్‌లు చాలా వరకు E20-Ready ఇంజిన్లతో వస్తున్నాయి. అంటే ఈ కొత్త ఇంధనాన్ని తట్టుకునేలా ఆ ఇంజిన్లను డిజైన్ చేశారు. కాబట్టి కొత్త వాహనదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే, పాత వాహనాలు కలిగిన వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. చాలా పాత మోడల్ వాహనాల్లో E20 పెట్రోల్‌ను వాడటం వల్ల ఇంధన వ్యవస్థలోని రబ్బరు భాగాలు, ఇతర పైపులు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. మీ వాహనం E20 ఇంధనానికి సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవడానికి కంపెనీ వెబ్‌సైట్ లేదా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించడం మంచిది.

ఒకవేళ మీ బండి పాతదైతే కంగారు పడాల్సిన పని లేదు. మార్కెట్లోకి ఇప్పటికే కన్వర్షన్ కిట్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఇలాంటి కిట్‌ను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొదట్లో వాహనదారులకు కొంచెం మైలేజీ భారం అనిపించినా, దీర్ఘకాలంలో పర్యావరణానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా ప్రయోజనకరంగా మారుతుంది. ఏప్రిల్ 2026 నుంచి పెట్రోల్ బంకుల వద్ద కొత్తగా కనిపించే ఈ 95 RON పెట్రోల్‌తో ప్రయాణం మరింత పర్యావరణ హితంగా మారబోతోంది.

Tags:    

Similar News