Renault Duster : డస్టర్ ఈజ్ బ్యాక్.. మార్చి 17న సరికొత్త ఎస్‌యూవీ ధరల ప్రకటన

మార్చి 17న సరికొత్త ఎస్‌యూవీ ధరల ప్రకటన

Update: 2026-03-12 08:22 GMT

Renault Duster :భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్ మళ్లీ కొత్త అవతారంలో సందడి చేసేందుకు సిద్ధమైంది. గత కొంతకాలంగా ఈ ఎస్‌యూవీ లాంచ్ గురించి జరుగుతున్న చర్చలకు త్వరలోనే తెరపడనుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మార్చి 17, 2026న ఈ సరికొత్త డస్టర్ ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఐరోపాలో విక్రయించే మోడల్‌కు, ఇండియాకు రాబోతున్న మోడల్‌కు మధ్య బాహ్య రూపంలో పోలికలు ఉన్నప్పటికీ, టెక్నాలజీలో మాత్రం మన డస్టర్ చాలా ప్రత్యేకం.

మన దేశం కోసం ప్రత్యేక ప్లాట్‌ఫారమ్

యూరప్ మార్కెట్‌లో డస్టర్‌ను CMF-B ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేస్తారు. కానీ, భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రెనో సంస్థ మన కోసం ప్రత్యేకంగా RGMP (Renault Group Modular Platform) అనే ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించింది. భారతీయ రోడ్లు, ఇక్కడి వాతావరణం, వినియోగదారులు ఆశించే దృఢత్వం, తక్కువ ధరను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేశారు. ఈ ప్లాట్‌ఫారమ్ చాలా ఫ్లెక్సిబుల్ కావడం వల్ల భవిష్యత్తులో వచ్చే 7-సీటర్ మోడల్స్ లేదా ఎలక్ట్రిక్ వెర్షన్లకు కూడా దీనిని వాడుకోవచ్చు.

స్మార్ట్ ఫీచర్ల జాతర

కొత్త డస్టర్ కేవలం చూడటానికే కాదు, ఫీచర్ల పరంగా కూడా చాలా స్మార్ట్‌గా ఉండబోతోంది. ఇందులో గూగుల్ బిల్ట్-ఇన్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. దీనివల్ల డ్రైవర్లు నేరుగా కారులోనే గూగుల్ మ్యాప్స్, ప్లే స్టోర్ యాప్స్‌ను వాడుకోవచ్చు. ప్రతి డ్రైవర్‌కు వేర్వేరు ప్రొఫైల్స్ సెట్ చేసుకునే సదుపాయం ఉండటం వల్ల, కారు మీ అలవాట్లను గుర్తు పెట్టుకుని పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇవి కాకుండా అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో చేర్చనున్నారు.

భవిష్యత్తుపై కన్ను

రెనో కేవలం డస్టర్‌తోనే ఆగిపోవడం లేదు. ఇదే RGMP ప్లాట్‌ఫారమ్‌పై రెనాల్ట్ బోరియల్ వంటి మరిన్ని ఎస్‌యూవీలను కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా, ఈ ప్లాట్‌ఫారమ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ టెక్నాలజీకి కూడా సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ విషయంలో కూడా రెనాల్ట్ ఎక్కడా రాజీ పడటం లేదు. గ్లోబల్ సేఫ్టీ టెస్టుల్లో ఈ కారు మంచి రేటింగ్ సాధిస్తుందని కంపెనీ ధీమాగా ఉంది. పాత డస్టర్ లాగే ఇది కూడా ఆఫ్-రోడింగ్‌లో కింగ్ అనిపించుకుంటుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News