Nissan Gravite : తక్కువ రేటు.. ఎక్కువ సీట్లు.. నిస్సాన్ కొత్త కారుకు ఫిదా అవుతున్న జనం

నిస్సాన్ కొత్త కారుకు ఫిదా అవుతున్న జనం

Update: 2026-04-02 09:35 GMT

Nissan Gravite : భారత ఆటోమొబైల్ రంగంలో నిస్సాన్ మోటార్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 2026 మార్చి నెలలో అత్యధిక దేశీయ అమ్మకాలను నమోదు చేసింది. కేవలం ఒక్క నెలలోనే 4,408 వాహనాలను విక్రయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి నెలలో జరిగిన 2,230 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది దాదాపు 98 శాతం పెరుగుదల కావడం విశేషం. ఇక ఎగుమతులతో కలిపి చూస్తే, మార్చిలో నిస్సాన్ మొత్తం 10,388 యూనిట్ల అమ్మకాలను పూర్తి చేసింది.

నిస్సాన్ సాధించిన ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణం వారి సరికొత్త 7 సీటర్ MPV గ్రావైట్. ఫిబ్రవరిలో లాంచ్ అయిన ఈ కారు డెలివరీలు మార్చి 1 నుంచి ప్రారంభమయ్యాయి. కేవలం రూ.5.65 లక్షల ప్రారంభ ధరకే (ఎక్స్‌షోరూమ్) 7 సీట్ల వసతి కల్పించడం ఈ కారుకు ప్లస్ పాయింట్ అయ్యింది. మన దేశంలో లభించే అత్యంత చవకైన ఫ్యామిలీ కార్ల జాబితాలో ఇది టాప్‌లో నిలిచింది. మాగ్నైట్‌తో పాటు ఇప్పుడు గ్రావైట్ కూడా తోడవడంతో నిస్సాన్ షోరూమ్‌లు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి.

గతంలో నిస్సాన్ ఎక్కువగా విదేశీ ఎగుమతులపైనే ఆధారపడేది. ఉదాహరణకు, ఫిబ్రవరిలో జరిగిన మొత్తం అమ్మకాల్లో ఎగుమతులే సింహభాగం (8,335 యూనిట్లు). కానీ గ్రావైట్ పుణ్యమా అని మార్చి నాటికి దేశీయ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. దీంతో అటు విదేశీ మార్కెట్, ఇటు లోకల్ మార్కెట్ మధ్య నిస్సాన్ సరైన బ్యాలెన్స్ సాధించగలిగింది. ఈ స్పందన చూస్తుంటే భవిష్యత్తులో నిస్సాన్ మరిన్ని అద్భుతాలు చేయబోతోందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నిస్సాన్ ప్రస్తుతం ఇండియా రిసర్జెన్స్ ప్లాన్ పేరుతో తన వ్యాపారాన్ని భారత్‌లో మరింత విస్తరించే పనిలో ఉంది. గ్రావైట్ అనేది ఈ ప్లాన్‌లో వచ్చిన మొదటి అస్త్రం మాత్రమే. రాబోయే రోజుల్లో మరో మూడు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం నిస్సాన్ ఇండియా నుంచి 65 దేశాలకు వాహనాలు ఎగుమతి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 280కి పైగా సర్వీస్ పాయింట్లను కలిగి ఉన్న నిస్సాన్, త్వరలోనే ఆ సంఖ్యను మరింత పెంచబోతోంది.

Tags:    

Similar News