Nissan Pixo: 259 కి.మీ రేంజ్, అదిరిపోయే ఫీచర్లు.. నిస్సాన్ నుంచి అత్యంత చిన్న ఎలక్ట్రిక్ కారు
అత్యంత చిన్న ఎలక్ట్రిక్ కారు
Nissan Pixo: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ తన సరికొత్త, అత్యంత చిన్న ఎలక్ట్రిక్ కార్ పిక్సోను అధికారికంగా ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది. ముఖ్యంగా యూరప్ దేశాలలోని పట్టణ ప్రాంత కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏ-సెగ్మెంట్ ఈవీని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. నిస్సాన్ డిజైన్ యూరప్, రెనో సంస్థల సంయుక్త సహకారంతో స్లోవేనియాలోని నోవో మెస్టో ఫ్యాక్టరీలో ఈ కారును తయారు చేశారు. ఆధునిక టెక్నాలజీతో పాటు సరికొత్త ఎలక్ట్రిక్ డిజైన్ లాంగ్వేజ్‌ను ఇందులో ఉపయోగించడం విశేషం.
ఆకట్టుకునే క్యూబ్ డిజైన్, లుక్స్
ఈ పిక్సో ఎలక్ట్రిక్ కారు బాహ్య రూపం క్యూబ్ ఆకారం నుంచి ప్రేరణ పొంది రూపొందించబడింది. ఇందులో పిక్సెల్-ఇన్సపైర్డ్ లైటింగ్, రోబోట్ ఫేస్ వంటి సరికొత్త ఫ్రంట్ బంపర్‌ను ఇచ్చారు. జపనీస్ భాషలో ని-సాన్ అనే పదాన్ని సూచించేలా 2-3 మార్కింగ్‌తో పాటు Pixo అనే పేరును ముద్రించారు. అంతేకాకుండా వండర్ పర్పుల్, గేర్ బ్లూ వంటి యువతను ఆకట్టుకునే సరికొత్త పెయింట్ ఆప్షన్లతో ఈ కారు మార్కెట్లో సందడి చేయనుంది. దీని పొడవు 3,796 మి.మీ ఉండగా, టర్నింగ్ సర్కిల్ కేవలం 9.9 మీటర్లు మాత్రమే ఉండటం వల్ల ఇరుకైన రోడ్లపై కూడా దీన్ని సులభంగా డ్రైవ్ చేయవచ్చు.
అధునాతన ఫీచర్లు, గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్
ఇంటీరియర్ పరంగా నిస్సాన్ పిక్సో చాలా సింపుల్‌గా, మోడర్న్‌గా కనిపిస్తుంది. ఇందులో 7-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు, ట్యాబ్లెట్ స్టైల్‌లో ఉండే 10-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. అంతేకాకుండా ఈ కారులో గూగుల్ జెమిని ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు. ఇది 16 వివిధ భాషలలో అందుబాటులో ఉంటుంది. వివిధ డ్రైవర్లను గుర్తించి వారి ఛాయిస్ సెట్టింగ్స్‌ను గుర్తుంచుకునే ఫేస్ ఐడీ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. భద్రత కోసం అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్-డిపార్చర్ వార్నింగ్ వంటి అధునాతన ఏడీఏఎస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
బ్యాటరీ ప్యాక్, రేంజ్, ఛార్జింగ్ వివరాలు
ఈ ఎలక్ట్రిక్ కారులో 27.5 kWh సామర్థ్యం కలిగిన లిథియం ఐరన్ ఫాస్ఫెట్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో 82 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జ్‌పై ఈ కారు డబ్ల్యూఎల్‌టీపీ నిబంధనల ప్రకారం సుమారు 259 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. అలాగే ఇది 50 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది, దీని ద్వారా కేవలం 28 నిమిషాల్లోనే బ్యాటరీ 15 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే ఇందులో 356 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ లభిస్తుంది. యూరప్‌లో దీని డెలివరీలు 2027 ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.