Tata Motors: డిసెంబర్ నెలలో కొత్తగా టాటా మోటార్స్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. దేశంలో అత్యధికంగా కార్లు విక్రయించే సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్ తన కస్టమర్లకు కాస్త చేదువార్త అందించింది. డిసెంబర్ 1, 2026 నుంచి తమ అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మారుతి సుజుకి బాటలోనే ఇప్పుడు టాటా కూడా ధరల పెంపు నిర్ణయం తీసుకోవడంతో, కొత్త కారు లేదా ఎస్‌యూవీని ఇంటికి తెచ్చుకోవాలంటే ఇకపై జేబుకు కాస్త ఎక్కువ పని చెప్పాల్సి వస్తుంది.

సగటున 0.5 శాతం పెంపు

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (TMPV) వెల్లడించిన వివరాల ప్రకారం, అన్ని ప్యాసింజర్ వాహనాల ధరల్లో సగటున 0.5 శాతం మేర పెరుగుదల ఉంటుంది. అయితే కంపెనీలోని ప్రతి కారు ధర కచ్చితంగా 0.5 శాతమే పెరుగుతుందని కాదు. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపులో తేడాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షలు ఉంటే, 0.5 శాతం చొప్పున సుమారు రూ.5,000 వరకు ధర పెరిగే అవకాశం ఉంది. కానీ అసలు పెరుగుదల ఆయా వేరియంట్లను బట్టి మారుతుందని కంపెనీ స్పష్టం చేసింది.

పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఈవీలపైనా ప్రభావం

ఈసారి టాటా మోటార్స్ చేసిన ధరల పెంపు కేవలం పెట్రోల్, డీజిల్ కార్లకు మాత్రమే పరిమితం కాలేదు. కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు (EVs), ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. అంటే నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ లాంటి ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే వారు కూడా డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ధరలకు అనుగుణంగా తమ బడ్జెట్‌ను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.

ముడిసరుకు ఖర్చుల భారంతోనే ఈ నిర్ణయం

కార్ల ధరలను ఎందుకు పెంచాల్సి వస్తుందో టాటా మోటార్స్ వివరణ ఇచ్చింది. గత కొంతకాలంగా వాహనాల తయారీలో వాడే ముడి సరుకులు, ఇతర విడిభాగాల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపింది. దీనివల్ల మొత్తం ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందన్నారు. కస్టమర్లపై ఎక్కువ భారం పడకూడదనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ ఆ అదనపు ఖర్చులో ఎక్కువ భాగాన్ని కంపెనీయే భరించిందని, కానీ ఖర్చులు తగ్గకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొంత భాగాన్ని ధరల రూపంలో కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని పేర్కొంది.

డిసెంబర్ కంటే ముందే బుకింగ్ చేసుకుంటే బెటర్

ధరలు పెంచినప్పటికీ కస్టమర్లకు తాము చెల్లించే డబ్బుకు తగినట్లుగా మెరుగైన ఫీచర్లు, అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తూనే ఉంటామని టాటా మోటార్స్ హామీ ఇచ్చింది. ఒకవేళ మీరు ఇప్పటికే టాటా కారు కొనాలని ఫిక్స్ అయి ఉంటే, డిసెంబర్ 1 కంటే ముందే దగ్గరలోని షోరూమ్‌లో ధర, ఆఫర్లు కనుక్కుని బుకింగ్ చేసుకోవడం వల్ల పెరిగిన ధరల భారం నుంచి తప్పించుకోవచ్చు.

Tags: