Bajaj Pulsar : అపాచీ కోటను బద్దలు కొట్టేందుకు పల్సర్ కొత్త స్కెచ్..2026లో సరికొత్త అవతారంలో క్లాసిక్ బైక్‌లు

2026లో సరికొత్త అవతారంలో క్లాసిక్ బైక్‌లు

Update: 2025-12-25 12:56 GMT

Bajaj Pulsar : భారతీయ రోడ్లపై దశాబ్దాలుగా రారాజుగా వెలుగొందుతున్న బజాజ్ పల్సర్ ఇప్పుడు తన రూపురేఖలను మార్చుకోబోతోంది. ముఖ్యంగా పల్సర్ 125, 150, 220F వంటి క్లాసిక్ మోడళ్లకు బజాజ్ భారీ అప్‌డేట్స్ ప్లాన్ చేస్తోంది. మార్కెట్లో టీవీఎస్ అపాచీ సిరీస్ ఇస్తున్న గట్టి పోటీని తట్టుకోవడానికి, అలాగే 2026 నాటికి పల్సర్ బ్రాండ్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ మెగా అప్‌డేట్‌ను సిద్ధం చేస్తున్నారు. పాత కాలపు డిజైన్లకు స్వస్తి చెప్పి, సరికొత్త టెక్నాలజీతో కుర్రాళ్లను ఆకట్టుకునేందుకు బజాజ్ రెడీ అవుతోంది.

ప్రస్తుత పల్సర్ క్లాసిక్ బైక్‌లలో పాతకాలపు డబుల్-క్రాడిల్ ఫ్రేమ్, వెనుక వైపు రెండు షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. అయితే రాబోయే 2026 మోడళ్లలో వీటిని తొలగించి, పల్సర్ N సిరీస్ (N125, N160)లో వాడుతున్న కొత్త ట్యూబ్యులర్ ఫ్రేమ్‌ను ఉపయోగించబోతున్నారు. దీనివల్ల బైక్ బరువు తగ్గి, నడపడానికి చాలా తేలికగా, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ రాబోతోంది. దీనివల్ల బైక్ లుక్ మరింత స్పోర్టీగా మారడమే కాకుండా, మలుపుల్లో బైక్ బ్యాలెన్స్ అద్భుతంగా ఉంటుంది.

కొత్త పల్సర్లలో ప్రస్తుతం ఉన్న DTS-i ఇంజిన్ల స్థానంలో పల్సర్ N సిరీస్‌లో వాడుతున్న ఆధునిక ఎయిర్-కూల్డ్ ఇంజిన్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కొత్త ఇంజిన్లు పాతవాటి కంటే చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా, వైబ్రేషన్లు లేకుండా ఎక్కువ పవర్‌ను అందిస్తాయి. కొత్త చేసిస్, ఇంజిన్ కలయిక వల్ల మైలేజీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వేగంతో పాటు ఇంజిన్ లైఫ్ కూడా పెరగాలని కోరుకునే వారికి ఈ అప్‌డేట్ పెద్ద ఊరటనిస్తుంది.

పల్సర్ అంటేనే ఒక స్పెషల్ లుక్. అందుకే బజాజ్ బాడీ డిజైన్ ను పూర్తిగా మార్చకుండా, అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు చేయబోతోంది. కొత్త కలర్ ఆప్షన్లు, సరికొత్త గ్రాఫిక్స్‌తో బైక్ ను అదిరిపోయేలా తీర్చిదిద్దనున్నారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మార్పుల వల్ల ధరలు కూడా స్వల్పంగా పెరగొచ్చు. ప్రస్తుతం పల్సర్ 125 ధర రూ.86 వేల నుంచి, పల్సర్ 220F ధర రూ. 1.28 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.

బజాజ్ ఈ సరికొత్త 2026 పల్సర్ క్లాసిక్ రేంజ్‌ను వచ్చే ఏడాది పండుగ సీజన్ సమయంలో విడుదల చేసే అవకాశం ఉంది. ముందుగా పల్సర్ 125, 150 మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ కొత్త అప్‌డేట్స్ తో పల్సర్ తన పాత వైభవాన్ని మళ్ళీ పుంజుకోవడమే కాకుండా, అపాచీ వంటి ప్రత్యర్థి కంపెనీలకు గట్టి సవాల్ విసరబోతోంది. కుర్రాళ్లు ఎప్పటినుంచో కోరుకుంటున్న మోనోషాక్ సస్పెన్షన్ పల్సర్ క్లాసిక్ లో రావడం ఈ బైక్ ల రేంజ్ ను మార్చేయబోతోంది.

Tags:    

Similar News