Renault Kiger : నెక్సాన్, ఫ్రాంక్స్ కి చుక్కలు చూపిస్తున్న రెనాల్ట్ కైగర్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు
Renault Kiger : భారతదేశంలో సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఈ విభాగంలో టాటా నెక్సాన్ , మారుతి ఫ్రాంక్స్ వంటి కార్లు రాజ్యమేలాయి. కానీ, ఇప్పుడు వీటికి గట్టి పోటీనిస్తూ రెనాల్ట్ కైగర్ 2026 సరికొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో మార్కెట్లోకి దూసుకొచ్చింది. అదిరిపోయే స్టైల్, బడ్జెట్ ధర, అదిరిపోయే ఫీచర్లతో మధ్యతరగతి ప్రజల మనసు గెలుచుకుంటోంది. మీరు నెక్సాన్ లేదా ఫ్రాంక్స్ కాకుండా వేరే ఆప్షన్ కోసం చూస్తుంటే కైగర్ గురించి ఈ విషయాలు తెలుసుకుందాం.
ధరలో అందనంత ఎత్తు
రెనాల్ట్ కైగర్ 2026 ధర వినియోగదారులకు పెద్ద ఊరటనిస్తోంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.5.76 లక్షల నుంచి మొదలై, టాప్ వేరియంట్ ఎమోషన్ టర్బో సీవీటీ రూ.10.34 లక్షల వరకు ఉంది. దీనిని నెక్సాన్ (రూ.7.32 లక్షలు), ఫ్రాంక్స్ (రూ.6.85 లక్షలు) ప్రారంభ ధరలతో పోలిస్తే, కైగర్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది. పైగా కొన్ని డీలర్‌షిప్‌ల వద్ద సీఎన్‌జీ కిట్ ఆప్షన్ కూడా ఉండటం వల్ల, మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.
ఇంజిన్, మైలేజీ
ఈ కారులో రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (71-72 bhp పవర్), రెండోది కొంచెం పవర్‌ఫుల్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (98-100 bhp పవర్). ఇందులో మాన్యువల్, ఏఎంటీ, సీవీటీ గేర్‌బాక్స్ సౌకర్యాలు ఉన్నాయి. మైలేజీ విషయానికి వస్తే లీటరుకు 18 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. ఇది మారుతి ఫ్రాంక్స్ కంటే కొంచెం తక్కువైనా, టాటా నెక్సాన్ మైలేజీకి సమానంగా ఉంటుంది. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉండటం విశేషం.
ఫీచర్ల సునామీ
కైగర్ 2026 ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ పరంగా చాలా మోడ్రన్‌గా మారింది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, 16-అంగుళాల అలాయ్ వీల్స్, షాడో గ్రే, ఒయాసిస్ ఎల్లో వంటి సరికొత్త రంగుల్లో ఇది మెరిసిపోతోంది. లోపల 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, అర్కామిస్ 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. వర్షం పడితే దానంతట అదే వైపర్లు తిరిగే రెయిన్-సెన్సింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
సేఫ్టీకి ప్రాధాన్యత
ప్రయాణికుల సేఫ్టీ విషయంలో రెనాల్ట్ రాజీ పడలేదు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో ఈ కారుకు 4-స్టార్ రేటింగ్ లభించింది. సేఫ్టీ పరంగా ఇది మారుతి ఫ్రాంక్స్ కంటే మెరుగైనదిగా పరిగణించబడుతోంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ (ESP), ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ముఖ్యం ఫీచర్లు ఉన్నాయి. మొత్తానికి తక్కువ బడ్జెట్‌లో ఒక సేఫ్, స్టైలిష్ ఎస్‌యూవీ కావాలనుకునే వారికి రెనాల్ట్ కైగర్ ఒక సూపర్ ఛాయిస్.