Renault Kiger : బ్రెజా, వెన్యూకు గట్టి పోటీ.. కొత్త అవతార్‌లో కైగర్ వస్తోంది, సీఎన్‌జీ ఆప్షన్ కూడా!

కొత్త అవతార్‌లో కైగర్ వస్తోంది, సీఎన్‌జీ ఆప్షన్ కూడా!;

Update: 2025-08-22 10:27 GMT

Renault Kiger : రెనాల్ట్ ఇండియా అప్‌డేట్ చేసిన కైగర్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా కంపెనీ ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆగస్టు 24న లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2021లో తొలిసారిగా విడుదలైన కైగర్, ఇప్పుడు భారీ అప్‌డేట్‌తో వస్తుండడం ఇదే మొదటిసారి. మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీల డిమాండ్ విపరీతంగా పెరిగిన సమయంలో ఈ కొత్త కైగర్ రాక బ్రెజా, వెన్యూ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ కొత్త కైగర్ మోడల్‌లో రెనాల్ట్ డిజైన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో కొత్త లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్, ముందు భాగంలో కంపెనీ కొత్త 2డీ డైమండ్ లోగో ఉండనుంది. నిస్సాన్ మాగ్నైట్ లాగా ఇందులో కూడా కొత్త డిజైన్ గ్రిల్, కొత్త బంపర్లు, సన్నని హెడ్‌ల్యాంప్స్, కొత్త ఎల్‌ఈడీ డీఆర్​ఎల్స్ ఉండొచ్చు. వెనుక భాగంలో కొత్త ఎల్‌ఈడీ ఇంటర్నల్స్‌తో కూడిన సి-ఆకారపు టెయిల్ ల్యాంప్‌లు ఎస్‌యూవీకి మరింత లేటెస్ట్ లుక్ ఇస్తుంది. ఇక ఇంజిన్ విషయానికొస్తే, ఇందులో పాత 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌లు యథాతథంగా కొనసాగుతాయి. ఇవి మాన్యువల్, ఏఎంటీ, సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, డీలర్ వద్ద సీఎన్‌జీ ఆప్షన్ కూడా లభిస్తుంది.

కొత్త రెనాల్ట్ కైగర్‌లో ఇంటీరియర్లలో కూడా మార్పులు ఉంటాయని అంచనా. ఇందులో ఇప్పుడు సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, కొత్త అప్‌హోల్‌స్ట్రీ, డాష్‌బోర్డ్ లేఅవుట్‌లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. టెక్నాలజీ పరంగా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు లభించవచ్చు. అలాగే, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండే అవకాశం ఉంది.

కొత్త కైగర్ లాంచ్ అయిన తర్వాత ఇది మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్‌లకు గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుత మోడల్ ధర కంటే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కొత్త మోడల్ ధర సుమారుగా రూ.6.2 లక్షల నుంచి రూ.11.5 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News