Top Selling Bikes: పెట్రోల్ బండ్ల నుంచి ఎలక్ట్రిక్ వరకు.. విలేజ్‌లలో టూ-వీలర్ల సునామీ
విలేజ్‌లలో టూ-వీలర్ల సునామీ
Top Selling Bikes: భారతదేశ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ట్రెండ్ వెలుగు చూసింది. కేవలం పెద్ద నగరాలు, మెట్రో సిటీలకే పరిమితం కాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు టూ-వీలర్ మార్కెట్‌కు అసలుసలైన కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ నివేదిక ప్రకారం.. 2026 మొదటి అర్ధభాగంలో (జనవరి - జూన్ మధ్య) దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం టూ-వీలర్ రిజిస్ట్రేషన్లలో ఏకంగా 55 శాతం వాటా కేవలం గ్రామీణ ప్రాంతాల నుంచే నమోదైంది. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల నుంచి 32 శాతం, మెట్రో నగరాల నుంచి 13 శాతం రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. దీన్ని బట్టి పల్లెటూర్లలో ద్విచక్ర వాహనాల డిమాండ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో బైక్‌లదే హవా
పల్లెల్లో ద్విచక్ర వాహనాలు అనగానే అందరి మొదటి ఎంపిక మోటార్ సైకిల్ అని మరోసారి రుజువైంది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన మొత్తం టూ-వీలర్ రిజిస్ట్రేషన్లలో దాదాపు 68.3 శాతం కేవలం మోటార్ సైకిళ్లే కావడం విశేషం. ముఖ్యంగా తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉండే 100cc నుంచి 125cc సామర్థ్యం గల ఎంట్రీ-లవెల్, కమ్యూటర్ బైక్‌లదే అక్కడ పూర్తి ఆధిపత్యం ఉంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అయితే 100-110cc బైక్‌ల వాటా ఏకంగా 74 శాతం వరకు నమోదైంది.
క్రమంగా పుంజుకుంటున్న స్కూటర్లు
గ్రామాల్లో కేవలం బైక్‌లే కాకుండా స్కూటర్ల వాడకం కూడా క్రమంగా పెరుగుతోంది. గ్రామీణ టూ-వీలర్ రిజిస్ట్రేషన్లలో స్కూటర్ల వాటా దాదాపు 24 శాతంగా ఉంది. ఇక ఎలక్ట్రిక్ టూ-వీలర్ల విషయానికి వస్తే.. పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో వీటికి ఆదరణ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రస్తుతం గ్రామాల్లో 94 శాతం పెట్రోల్ వాహనాలే అమ్ముడుపోతుండగా, ఈవీల వాటా సుమారు 5.9 శాతంగా ఉంది. అయితే టీవీఎస్, బజాజ్ వంటి ప్రముఖ కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను వేగంగా విస్తరిస్తున్నాయి.
భవిష్యత్ టూ-వీలర్ మార్కెట్‌పై గ్రామీణ ప్రాంతాల ప్రభావం
మొత్తంమీద 2026 మొదటి ఆరు నెలల కాలంలో గ్రామీణ భారతం టూ-వీలర్ మార్కెట్‌కు ఒక పవర్ఫుల్ గ్రోత్ ఇంజిన్‌లా పనిచేసింది. నగరాల్లో ట్రాఫిక్, ఇతర కారణాల వల్ల ట్రెండ్ మారుతున్నప్పటికీ, పల్లెల్లో మాత్రం నిత్యవసర ప్రయాణాల కోసం టూ-వీలర్ల అవసరం ఎప్పుడూ ఉంటుంది. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఛార్జింగ్ సదుపాయాలు మెరుగైతే, ఎలక్ట్రిక్ టూ-వీలర్ల వాటా మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.