Tata Aeris: 20 టన్నుల రాళ్లు పడ్డా ఏం కాలేదు.. టాటా ఏరిస్ సేఫ్టీ టెస్ట్ వీడియో చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే
దిమ్మ తిరిగిపోవాల్సిందే
Tata Aeris: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో భద్రతకు పెద్దపీట వేసే టాటా మోటార్స్ తాజాగా తన సరికొత్త టాటా ఏరిస్ సెడాన్ కార్‌ను విడుదల చేసింది. ఈ కార్ల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.5.29 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ కారు ఎంత బలంగా ఉందో నిరూపించడానికి కంపెనీ నిర్వహించిన ఒక సేఫ్టీ డెమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక పెద్ద డంప్ ట్రక్కు ద్వారా ఏకంగా 20 టన్నుల బరువైన రాళ్లు, మట్టిని నేరుగా ఈ కారు పైకి పోశారు. అంత భారీ బరువు పడినప్పటికీ కారు బాడీ స్ట్రక్చర్ చెక్కుచెదరకపోవడం విశేషం. ఆ తర్వాత ఆ కారును అక్కడి నుంచి నడుపుకుంటూ వెళ్లడాన్ని వీడియోలో చూపించారు.
ఈ సరికొత్త డెమో ద్వారా టాటా ఏరిస్ కారు బలమైన ఛాసిస్, బాడీ ఫ్రేమ్ ఎంత పటిష్టంగా ఉన్నాయో కంపెనీ నిరూపించ ప్రయత్నించింది. అయితే ఇది అధికారిక క్రాష్-టెస్ట్ రేటింగ్ కాకపోయినప్పటికీ, కారు ఎంత పటిష్టంగా తయారైందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. మార్కెట్లో ఈ కారు మారుతి డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి ప్రముఖ కాంపాక్ట్ సేడాన్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
టాటా ఏరిస్ అధికారిక భారత్ NCAP లేదా గ్లోబల్ NCAP క్రాష్-టెస్ట్ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అయినప్పటికీ ప్రయాణికుల భద్రత కోసం ఇందులో అనేక ఆధునిక ఫీచర్లను చేర్చారు. కారులోని ప్రయాణికులందరి రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఇన్‌బిల్ట్ డాష్‌క్యామ్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అలాగే హిల్-హోల్డ్ కంట్రోల్, రోల్-ఓవర్ మిటిగేషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, చిన్న పిల్లల సీట్ల కోసం ఐసోఫిక్స్ మౌంట్లు కూడా లభిస్తున్నాయి.
పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే.. టాటా ఏరిస్ కారులో 1.2-లీటర్ 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 86bhp శక్తిని, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి జతగా 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ ప్రయాణాలు చేసేవారి కోసం కంపెనీ దీనిలో CNG వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. సీఎన్జీ మోడల్ 76bhp పవర్, 97Nm టార్క్‌ను ఇస్తుంది. తక్కువ నిర్వహణ ఖర్చు కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఈ కారు చక్కటి ఎంపికగా నిలవనుంది.