Simple Ultra : ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో కొత్త చరిత్ర.. ఒక్క చార్జ్‌తో 400 కి.మీ రేంజ్
ఒక్క చార్జ్‌తో 400 కి.మీ రేంజ్
Simple Ultra : భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అంటేనే మనకు మొదట గుర్తొచ్చేది చార్జింగ్ భయం. ఎక్కడ ఆగిపోతుందో, రోజులు తరబడి చార్జింగ్ పెట్టాలేమో అన్న టెన్షన్ కు ఇప్పుడు చెక్ పడింది. ప్రముఖ ఈవీ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ దేశంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఒకసారి చార్జ్ చేస్తే వారం రోజుల వరకు సాఫీగా తిరగొచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ఇప్పటివరకు ఏ స్కూటర్ ఇవ్వని విధంగా సింపుల్ అల్ట్రా ఏకంగా 400 కి.మీ రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం కంపెనీ ఇందులో భారీ 6.5 kWh బ్యాటరీని అమర్చింది. మీకు ఉదాహరణగా చెప్పాలంటే.. బెంగళూరులో స్టార్ట్ అయితే చెన్నై వరకు ఈ స్కూటర్ మీద సులభంగా చేరుకోవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ టాటా టియాగో ఈవీ (250-315 కి.మీ) కంటే కూడా ఈ స్కూటర్ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దీనివల్ల నగరాల్లో ఉండేవారు కేవలం వారానికి ఒక్కసారి చార్జ్ చేసుకుంటే సరిపోతుంది.
సింపుల్ అల్ట్రా కేవలం రేంజ్ లోనే కాదు, పర్ఫార్మెన్స్ లోనూ రికార్డులు సృష్టిస్తోంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కి.మీ. కేవలం 2.77 సెకన్లలోనే 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం దేశంలో లభిస్తున్న వేగవంతమైన స్కూటర్లలో ఇది రెండో స్థానంలో ఉంది (మొదటి స్థానం కంపెనీకే చెందిన సింపుల్ వన్ ది). ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ లైట్ పడగానే చిటికెలో మాయమైపోయే పవర్ దీని సొంతం.
సాంకేతికపరంగా ఈ స్కూటర్ చాలా అడ్వాన్స్‌డ్ గా ఉంది. వర్షం పడినప్పుడు లేదా రోడ్లు సరిగా లేనప్పుడు స్కూటర్ స్కిడ్ అవ్వకుండా ఇందులో ఫోర్-లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చారు. డ్యాష్ బోర్డులో 7-అంగుళాల భారీ టచ్ స్క్రీన్ ఉంటుంది. దీని ద్వారా గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్, రైడింగ్ మోడ్స్, బ్యాటరీ స్టేటస్ ను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ, యాప్ సపోర్ట్ ద్వారా స్కూటర్ ను మొబైల్ నుండే కంట్రోల్ చేయవచ్చు.
ఈ పవర్ ఫుల్ స్కూటర్ ధర రూ.2.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కంపెనీ రిటైల్ నెట్‌వర్క్‌లో డెలివరీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, కొచ్చి వంటి నగరాల్లో 70కి పైగా అవుట్‌లెట్లలో ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే నాగ్‌పూర్, రాంచీ, భువనేశ్వర్ వంటి నగరాలకు కూడా కంపెనీ తన నెట్‌వర్క్‌ను విస్తరించబోతోంది. ఒకసారి కొంటే చార్జింగ్ టెన్షన్ ఉండకూడదు అనుకునే వారికి సింపుల్ అల్ట్రా ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.