Triumph: రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350కి గట్టి పోటీ..దీపావళికి మార్కెట్లోకి రానున్న ట్రయంఫ్ కొత్త బైక్
ట్రయంఫ్ కొత్త బైక్
Triumph: దేశంలోని బైక్ లవర్లకు, ముఖ్యంగా క్లాసిక్ మోటార్ సైకిళ్లను ఇష్టపడే వారికి దీపావళి పండుగ కంటే ముందే ఒక అదిరిపోయే శుభవార్త అందనుంది. ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ తన సరికొత్త మోడల్ అయిన బోనెవిల్లే 400 బైక్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే దీపావళి 2026 నాటికి ఈ అద్భుతమైన బైక్ రోడ్లపైకి దూసుకువచ్చే అవకాశం ఉంది. బజాజ్ ఆటో సంస్థ పుణే ప్లాంట్‌లో ఈ బైక్‌ను తయారు చేస్తుండటంతో, దీని ధరను చాలా పోటీతృత్వంతో ఉంచే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ట్రయంఫ్ బోనెవిల్లే 400 డిజైన్ పూర్తిగా రెట్రో లుక్‌ను ఇష్టపడే యువతను, క్లాసిక్ బైక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా రూపొందించారు. ముఖ్యంగా రాయల్ ఎఫీల్డ్ క్లాసిక్ 350, హోండా సీబీ350 బైక్‌లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ బైక్‌లో స్ట్రైట్ రైడింగ్ పొజిషన్, పొడవైన ఫ్లాట్ సీటు, వైర్-స్పోక్ వీల్స్, వెనుక వైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్, ఆకర్షణీయమైన క్రోమ్ ఫినిషింగ్ వంటి క్లాసిక్ ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్ దీనికి మరింత అందాన్ని తెచ్చిపెట్టనున్నాయి.
ఈ బైక్‌లో 349సీసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చే అవకాశం ఉంది. ఇది సుమారు 36.5 bhp పవర్, 32 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదని సమాచారం. దీని పనితీరు మార్కెట్లో ఉన్న ఇతర 350సీసి బైక్‌లతో పోలిస్తే చాలా శక్తివంతంగా ఉండనుంది. ఇక ధర విషయానికి వస్తే, ట్రయంఫ్ బోనెవిల్లే 400 ఎక్స్-షోరూమ్ ధర రూ.2.3 లక్షల నుంచి రూ.2.6 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ వంటి మోడళ్లతో పాటు ఇప్పుడు ఈ బోనెవిల్లే 400 కూడా చేరడంతో ట్రయంఫ్ 400సీసి శ్రేణి మరింత విస్తరించనుంది.