Skoda Slavia: కార్ లవర్లకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 6న లాంచ్ కానున్న సరికొత్త స్కోడా, హోండా కార్లు!
సరికొత్త స్కోడా, హోండా కార్లు!
Skoda Slavia: కొత్త కార్లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసే వారికి రాబోయే వారం చాలా ఉత్సాహంగా ఉండనుంది. అక్టోబర్ 6న భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి రెండు అద్భుతమైన ఫేస్‌లిఫ్ట్ కార్లు ప్రవేశించబోతున్నాయి. అందులో మొదటిది ప్రముఖ బ్రాండ్‌కు చెందిన స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన డిజైన్ అన్‌వీల్ కాగా, ఇప్పుడు అధికారిక ధరలను వెల్లడించనున్నారు. ఎక్స్‌టీరియర్ పరంగా అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్స్, కనెక్టింగ్ ఎల్‌ఈడీ బార్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, కొత్త అల్లాయ్ వీల్స్, రివైజ్డ్ టెయిల్‌ల్యాంప్స్ అమర్చారు. కేబిన్ లోపల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన సౌకర్యాలు లభిస్తాయి. ముఖ్యంగా వెనుక కూర్చునే ప్రయాణికుల కోసం సీట్ మసాజ్ ఫంక్షన్ ఇవ్వడం విశేషం.
స్లావియా ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటిలాగే 1.0-లీటర్ టీఎస్‌ఐ అలాగే 1.5-లీటర్ టీఎస్‌ఐ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పాటు కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ అలాగే 6-స్పీడు మాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. అలాగే 1.5-లీటర్ ఇంజిన్ వెర్షన్ కేవలం 7-స్పీడ్ డీఎస్‌జీ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే వస్తుంది. ఇప్పటికే కంపెనీ ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ను ప్రారంభించింది.
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ విశేషాలు
ఇదే రోజు హోండా సంస్థ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా విడుదల చేయనుంది. టీజర్ల ద్వారా ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. అప్‌డేటెడ్ ఎలివేట్ ఎక్స్‌టీరియర్‌లో సరికొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, రీజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త బంపర్లు ఇవ్వనున్నారు. టెయిల్‌ల్యాంప్స్ వద్ద కనెక్టింగ్ ట్విన్ ఎల్‌ఈడీ బార్‌ను అమర్చడం ద్వారా మరింత ప్రీమియం లుక్‌ను తీసుకువచ్చారు. ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ ఎస్‌యూవీలో హోండా సెన్సింగ్ ఏడీఏఎస్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు అందించారు. దీనికి తోడు 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్-స్పాట్ మానిటర్ కూడా యాడ్ చేశారు. ఇందులో ఉన్న 1.5-లీటర్ 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజిన్ 121పీఎస్ పవర్, 145ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మాన్యువల్ అలాగే సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు.