Suzuki Motorcycle : 37 శాతం వృద్ధి.. 1.23 లక్షల బైక్‌లతో సుజుకి ఇండియా సరికొత్త రికార్డు
1.23 లక్షల బైక్‌లతో సుజుకి ఇండియా సరికొత్త రికార్డు
Suzuki Motorcycle : టూవీలర్ మార్కెట్‌లో జపనీస్ దిగ్గజం సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా దుమ్మురేపుతోంది. 2026 ఫిబ్రవరి నెలలో ఈ కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో 37 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి తన సత్తా చాటింది. గతేడాది ఫిబ్రవరిలో కేవలం 89,966 యూనిట్లు విక్రయించిన సుజుకి, ఈ ఏడాది అదే నెలకు ఏకంగా 1,23,299 యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా దేశీయ మార్కెట్‌లో సుజుకి స్కూటర్లు, బైక్‌లకు ఆదరణ విపరీతంగా పెరగడమే ఈ విజయానికి ప్రధాన కారణం.
దేశీయ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. గత నెలలో సుజుకి ఇండియా 1,01,071 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాది ఇదే సమయంతో (73,215 యూనిట్లు) పోలిస్తే ఏకంగా 38 శాతం పెరుగుదల. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశీ ఎగుమతుల్లో కూడా సుజుకి జోరు ప్రదర్శించింది. ఎగుమతులు కూడా 33 శాతం పెరిగి 22,228 యూనిట్లకు చేరుకున్నాయి. వాహనాల అమ్మకాలతో పాటు స్పేర్ పార్ట్స్ విభాగం కూడా లాభాల బాట పట్టింది. ఫిబ్రవరిలోనే ఈ విభాగం ద్వారా కంపెనీకి రూ. 89.36 కోట్ల ఆదాయం సమకూరింది.
కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సుజుకి తన ప్రొడక్ట్ లైనప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సుజుకి యాక్సెస్ స్కూటర్‌లో సింగిల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టి భద్రతకు పెద్దపీట వేసింది. నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా డెహ్రాడూన్‌లో కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించడమే కాకుండా, సిక్కింలోని గాంగ్టక్‌లో తన తొలి షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. దీనివల్ల ఇప్పుడు సుజుకి బ్రాండ్ ఉనికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ చాటుకున్నట్లయింది.
కేవలం అమ్మకాలకే పరిమితం కాకుండా కస్టమర్లతో నిరంతరం టచ్‌లో ఉండేందుకు సుజుకి వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సుజుకి మత్సురి ఫెస్టివల్ లో దాదాపు 3,700 మంది రైడర్లు పాల్గొని సందడి చేశారు. అలాగే దేశవ్యాప్తంగా సుజుకి మోటోఫెస్ట్ క్యాంపెయిన్‌ను ప్రారంభించి రైడర్లకు తమ వాహనాలను టెస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. కోల్‌కతా, నాగ్‌పూర్, కోజికోడ్ వంటి నగరాల్లో గిక్సర్ పిట్ స్టాప్ ఈవెంట్లు, యాక్సెస్ స్కూటర్ కోసం మైలేజ్ కాంటెస్ట్ వంటి పోటీలు నిర్వహించి కస్టమర్లకు మరింత దగ్గరవుతోంది.