Tata Curvv EMI : స్టైలిష్ లుక్.. అదిరిపోయే ఫీచర్లు.. టాటా కర్వ్ టాప్ మోడల్ ఈఎంఐ ఎంతంటే?

టాటా కర్వ్ టాప్ మోడల్ ఈఎంఐ ఎంతంటే?

Update: 2026-03-14 09:57 GMT

Tata Curvv EMI : టాటా మోటార్స్ తన విలక్షణమైన డిజైన్‌తో మార్కెట్లోకి వదిలిన కూపే స్టైల్ ఎస్‌యూవీ టాటా కర్వ్ ప్రస్తుతం కార్ల ప్రేమికుల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణ ఎస్‌యూవీలకి భిన్నంగా వెనుక వైపు వాలిపోయిన రూఫ్ లైన్, స్పోర్టీ లుక్స్‌తో ఇది రోడ్డు మీద వెళ్తుంటే అందరి కళ్లు దీనివైపే మళ్లుతున్నాయి. అయితే, ఈ స్టైలిష్ కారును ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీపై లోన్ తీసుకుంటే నెలకు ఎంత ఈఎంఐ పడుతుందో, ఆ లెక్కలేంటో వివరంగా చూద్దాం.

భారత మార్కెట్లో టాటా కర్వ్ నేరుగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి హేమాహేమీలతో తలపడుతోంది. కూపే డిజైన్ దీనికి ప్లస్ పాయింట్ అయినప్పటికీ, ఈ సెగ్మెంట్‌లో పోటీ చాలా తీవ్రంగా ఉండటంతో అమ్మకాలు ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సర్వీస్ క్వాలిటీ విషయంలో కస్టమర్లలో ఉన్న కొన్ని అపోహలు కూడా దీనిపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ ఫీచర్లు, సేఫ్టీ పరంగా టాటా కర్వ్ అగ్రస్థానంలో నిలుస్తోంది.

ధర విషయానికి వస్తే.. టాటా కర్వ్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.9.65 లక్షల నుంచి రూ.18.85 లక్షల మధ్య ఉంది. మనం ఈఎంఐ లెక్కల కోసం టాప్ వేరియంట్ Accomplished +A DCA 1.5ను ఉదాహరణగా తీసుకుందాం. దీని ధర సుమారు రూ.18.85 లక్షలు. మీరు ఈ మొత్తంపై 9.5% వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే, టైం పిరియడ్ బట్టి మీ జేబుపై పడే భారం ఇలా ఉంటుంది. మీరు కేవలం 24 నెలల (రెండేళ్లు) కాలపరిమితి ఎంచుకుంటే, నెలవారీ ఈఎంఐ రూ.86,539 గా ఉంటుంది. ఈ రెండేళ్లలో మీరు అసలు కాకుండా అదనంగా రూ.1.92 లక్షల వడ్డీ కట్టాల్సి ఉంటుంది.

ఒకవేళ నెలకు అంత భారం మోయలేము అనుకుంటే, మూడేళ్ల (36 నెలలు) ఆప్షన్ ఎంచుకోవచ్చు. అప్పుడు ఈఎంఐ రూ.60,375కి తగ్గుతుంది. కానీ వడ్డీ మొత్తం రూ.2.88 లక్షలకు పెరుగుతుంది. ఇంకా తక్కువ ఈఎంఐ కావాలంటే నాలుగేళ్ల (48 నెలలు) కాలపరిమితిని ఎంచుకోవచ్చు. అప్పుడు నెలకు రూ.47,352 కడితే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు చెల్లించే మొత్తం వడ్డీ రూ.3.88 లక్షల వరకు చేరుకుంటుంది. అందుకే కార్ లోన్ తీసుకునే ముందు మీరు కట్టే డౌన్ పేమెంట్, ఎంచుకునే కాలపరిమితి మీ నెలవారీ బడ్జెట్‌కు తగినట్టుగా ఉండేలా చూసుకోవడం మంచిది.

Tags:    

Similar News