Tata Motors: దీపావళి పండుగ వేళ సొంతం చేసుకునేందుకు అడుగులు వేస్తున్న కార్ల ప్రియులకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారీ గుడ్ న్యూస్ అందించింది. అక్టోబర్ నెలలో ఆటో మార్కెట్లో సరికొత్త డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ తన కార్లపై వేల రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి మొదలుకొని అత్యంత ఆకర్షణీయమైన ఎస్‌యూవీల వరకు అన్ని ప్రముఖ మోడళ్లపై ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాటా కర్వ్ మోడల్‌పై ఏకంగా లక్షకు పైగా ప్రయోజనాలు కల్పిస్తుండటంతో కొనుగోలుదారులు ఎగబడుతున్నారు.

టాటా కర్వ్‌పై భారీ తగ్గింపు

యూనిక్ డిజైన్‌తో మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న కూపే-స్టైల్ ఎస్‌యూవీ టాటా కర్వ్ కొనుగోలుపై ఈ నెలలో అత్యధికంగా రూ.1.25 లక్షల వరకు బంపర్ ఆఫర్లు లభిస్తున్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనాలతో పాటు లాయల్టీ బోనస్ కూడా కలుపుకుని ఈ భారీ తగ్గింపు వర్తిస్తుంది. ఇక కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కర్వ్ ఎక్స్ సిరీస్‌పై రూ.20,000 వరకు లాయల్టీ బోనస్ అందిస్తున్నారు. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఈ కారును కొనేందుకు ఇదే సరైన సమయంగా నిపుణులు చెబుతున్నారు.

టాటా ఆల్ట్రోజ్, నెక్సాన్ కార్లపై ప్రత్యేక ఆఫర్లు

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.45,000 వరకు, అలాగే డీజిల్ మోడల్‌పై రూ.40,000 వరకు క్యాష్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు దక్కుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ పెట్రోల్ మోడల్‌పై రూ.45,000, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.55,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. డీజిల్ మోడల్‌పై కూడా రూ.20,000 వరకు తగ్గింపు లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆఫర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

టియాగో, టిగోర్, హారియర్ పై బంపర్ డిస్కౌంట్లు

పాత స్టాక్‌లో ఉన్న ప్రి-ఫేస్‌లిఫ్ట్ టాటా టియాగో కొనుగోలుపై రూ.35,000 వరకు, టిగోర్ పై రూ.30,000 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే శక్తివంతమైన ఎస్‌యూవీ అయిన టాటా హారియర్ డీజిల్ మోడల్‌పై రూ.45,000 వరకు తగ్గింపు లభిస్తోంది. సరికొత్తగా మార్కెట్లో సందడి చేస్తున్న టాటా సియెర్రా పెట్రోల్, డీజిల్ మోడళ్లపై ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ బోనస్‌లతో కలిపి రూ.60,000 వరకు లాభం పొందవచ్చు. డీలర్‌షిప్‌లను బట్టి ఈ ఆఫర్లలో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలుదారులు ముందుగానే సమీప షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.

Tags: