Tata EV: బ్యాటరీని కొనుగోలు చేయాల్సిన పనిలేదు.. సగం ధరకే టాటా ఈవీ కార్లు
టాటా ఈవీ కార్లు
Tata EV: భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారుల కోసం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తమ పూర్తి ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్ కోసం బ్యాటరీ-యూజ్-ఎ-సర్వీస్ మోడల్‌ను విజయవంతంగా ప్రారంభించింది. గతంలో ఈ సౌకర్యం కేవలం టియాగో ఈవీ, పంచ్ ఈవీ వంటి కొన్ని ప్రారంభ స్థాయి మోడళ్లకు మాత్రమే పరిమితం చేయబడి ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీ ఈ సేవలను నెక్సాన్ ఈవీ , కర్వ్ ఈవీ, సియెర్రా ఈవీ అలాగే ఫ్లాగ్‌షిప్ హారియర్ ఈవీ వంటి అన్ని ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లకు కూడా విస్తరించింది.
అసలు ఏమి ఈ బాస్ మోడల్?
ఈ సరికొత్త విధానంలో కారును కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీకి సంబంధించిన పూర్తి ధరను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఈవీ కార్ల ప్రారంభ కొనుగోలు ధర భారీగా తగ్గిపోతుంది. ఉదాహరణకు టాటా ఈవీ కార్ల ప్రారంభ ధర ఈ విధానం ద్వారా ఏకంగా రూ.4.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కారు మరియు బ్యాటరీ ధరలను పూర్తిగా వేరు చేసి, కస్టమర్లపై ఆర్థిక భారం పడకుండా డ్యూయల్-లోన్ ఫైనాన్స్ ప్రొడక్ట్ రూపంలో కంపెనీ దీన్ని అందిస్తోంది.
కారు అలాగే బ్యాటరీ ఫైనాన్స్ వేర్వేరుగా..
ఈ బాస్ మోడల్ కింద కారుకు ఒక లోన్, బ్యాటరీకి మరొక లోన్ రూపంలో ఫైనాన్సింగ్ సదుపాయం లభిస్తుంది. వినియోగదారుడు తాను ఎంచుకున్న బ్యాటరీ సామర్థ్యం, డౌన్ పేమెంట్ అలాగే లోన్ కాలపరిమితి ఆధారంగా ప్రతి నెలా ప్రత్యేకంగా కిస్తీ చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద బ్యాటరీ కలిగిన కార్లకు ఈ చెల్లింపులు కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. అలాగే బ్యాటరీ వినియోగాన్ని బట్టి కిలోమీటరుకు నిర్దిష్టమైన ఛార్జీని కూడా చెల్లించాల్సి ఉంటుంది.
కిలోమీటరు ప్రాతిపదికన బ్యాటరీ ఛార్జీలు
ఈ విధానంలో బ్యాటరీని కేవలం ఫైనాన్స్ చేయడమే కాకుండా, దాని వినియోగానికి తగినట్లుగా ప్రత్యేక ఛార్జీలను నిర్ణయించారు. ఉదాహరణకు టియాగో ఈవీ మరియు పంచ్ ఈవీ కార్లకు కిలోమీటరుకు రూ. 2.6 చొప్పున, నెక్సాన్ ఈవీకి రూ.4.4, కర్వ్ ఈవీకి రూ.5, సియారా ఈవీకి రూ.5.5, హారియర్ ఈవీకి కిలోమీటరుకు రూ.5.9 చొప్పున బ్యాటరీ వినియోగ ఛార్జ్ వర్తిస్తుంది. అయితే ఈ ఛార్జీలలో కారు ఛార్జింగ్, సర్వీసింగ్ లేదా రిపేర్ ఖర్చులు ఏవీ కలిసి ఉండవు.
వివిధ మోడళ్ల సవరించిన ప్రారంభ ధరలు
* టాటా టియాగో ఈవీ: సాధారణ ధర రూ.6.99 లక్షలు కాగా, బాస్ విధానంలో రూ.4.69 లక్షలకే లభిస్తుంది (19kWh బ్యాటరీ).
* టాటా పంచ్ ఈవీ: సాధారణ ధర రూ.9.79 లక్షలు కాగా, బాస్ ద్వారా రూ.6.59 లక్షల ప్రారంభ ధరతో దొరుకుతుంది (30kWh బ్యాటరీ).
* టాటా నెక్సాన్ ఈవీ: సాధారణ ధర రూ.14.34 లక్షలు కాగా, బాస్ మోడల్‌లో రూ.8.99 లక్షలకు వస్తుంది (45kWh బ్యాటరీ).
* టాటా కర్వ్ ఈవీ: సాధారణ ధర రూ.17.19 లక్షలు కాగా, బాస్ ద్వారా రూ.10.99 లక్షలకే సొంతం చేసుకోవచ్చు (55kWh బ్యాటరీ).
* టాటా సియెర్రా ఈవీ: సాధారణ ధర రూ.18.79 లక్షలు కాగా, బాస్ ఆప్షన్‌తో రూ.11.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది (63kWh బ్యాటరీ).
* టాటా హారియర్ ఈవీ: సాధారణ ధర రూ.21.79 లక్షలు కాగా, బాస్ మోడల్‌లో రూ.14.49 లక్షలకు లభిస్తుంది (65kWh బ్యాటరీ).
కస్టమర్లకు లభించే ప్రయోజనాలు
ఈ బాస్ మోడల్ వల్ల ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేటప్పుడు ప్రథమంగా పెట్టే పెట్టుబడి లేదా ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. అయితే కస్టమర్లు తమ రోజువారీ ప్రయాణ దూరం అలాగే కిలోమీటరు వారీగా చెల్లించే ఛార్జీలను బేరీజు వేసుకుని ఈ ప్లాన్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించకుండా ఈవీలను కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి మరియు ప్రీమియం కస్టమర్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.