Car Buying Guide: మన దేశంలో పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ఆటోమొబైల్ మార్కెట్లో సందడి ఒక్కసారిగా మారిపోతుంది. గణేష్ చతుర్థి, దసరా నుంచి దీపావళి అలాగే ధంతేరాస్ వరకు ప్రతి ఒక్కరూ కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకురావడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. ఈ సమయంలో షోరూమ్‌లకు కస్టమర్లు పోటెత్తుతుంటారు. అయితే పండుగ సీజన్‌లో కార్ల కంపెనీలు, డీలర్లు అందించే బంఫర్ డిస్కౌంట్ల వెనుక అసలు లెక్క ఏమిటి? ఈ పండగ ఆఫర్లను ఉపయోగించుకోవడం ద్వారా కస్టమర్‌కు ఏ విధంగా లాభం చేకూరుతుందో ఇక్కడ పూర్తిగా పరిశీలిద్దాం.

పాత స్టాక్‌ను క్లియర్ చేసే వ్యాపార వ్యూహం

కార్ల కంపెనీలు పండుగ సీజన్‌లో భారీ డిస్కౌంట్లు ప్రకటించడానికి ప్రధాన కారణం స్టాక్ క్లియరెన్స్. ప్రతి ఏడాది చివరికి వస్తున్న తరుణంలో లేదా కొత్త మోడల్ కార్లు మార్కెట్లోకి వచ్చే ముందు, పాత స్టాక్‌ను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని కంపెనీలు భావిస్తాయి. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే పాత స్టాక్ మోడళ్ల రీసేల్ వాల్యూ తగ్గిపోతుంది. ఈ కారణంగానే కంపెనీలు భారీ రాయితీలు ఇచ్చి పాత స్టాక్‌ను విక్రయించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి.

క్యాష్ డిస్కౌంట్లు అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్‌లు

ఫెస్టివల్ సీజన్ సేల్స్‌లో భాగంగా ఆటో కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తాయి. వాటిలో క్యాష్ డిస్కౌంట్ ప్రధానమైనది. దీనివల్ల నేరుగా కారు ధరలో కొంత మొత్తం తగ్గుతుంది. అంతేకాకుండా పాత కారును ఇచ్చి కొత్త కారును కొనుగోలు చేసే వారికి ప్రత్యేకంగా ఎక్స్ఛేంజ్ బోనస్ సదుపాయం లభిస్తుంది. దీనిద్వారా కస్టమర్లు తమ పాత వాహనానికి మంచి ఎక్స్ఛేంజ్ విలువతో పాటు అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

కార్పొరేట్ బెనిఫిట్స్, ఉచిత యాక్ససరీలు

పెద్ద కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగాలు చేసేవారికి ప్రత్యేకంగా కార్పొరేట్ డిస్కౌంట్ వర్తిస్తుంది. దీనిద్వారా ఉద్యోగులు మరింత తక్కువ ధరకు వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా కస్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి కార్ల కంపెనీలు ఉచితంగా కొన్ని యాక్ససరీలను అందిస్తాయి. సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్లు, కార్ కవర్లు వంటి విలువైన వస్తువులను ఉచితంగా పొందడం ద్వారా పండుగ సమయంలో వేల రూపాయలు ఆదా అవుతాయి.

తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు

కేవలం కార్ల కంపెనీలే కాకుండా వివిధ బ్యాంకులు అలాగే ఆర్థిక సంస్థలు కూడా పండుగ సీజన్‌లో ఆకర్షణీయమైన లోన్ ఆఫర్లను ప్రకటిస్తాయి. కార్ల లోన్లపై తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులో ప్రత్యేక రాయితీలు వంటివి కల్పిస్తాయి. కొనుగోలుదారులు కొద్దిగా శ్రద్ధ పెట్టి సరైన రీసెర్చ్ చేస్తే, తక్కువ వడ్డీకి సులభమైన ఈఎంఐ ఆప్షన్లతో కారును లోన్‌పై తీసుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది.

పండుగ ఆఫర్లను సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం ఎలా?

పండుగ సీజన్‌లో వచ్చే ఆఫర్లు ఎంతో ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, కస్టమర్లు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డీలర్ల నుంచి కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాకుండా ఆన్-రోడ్ ధర, ఇన్సూరెన్స్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ప్యాకేజీల గురించి పూర్తిగా చర్చించాలి. వివిధ డీలర్‌షిప్‌లలో లభించే ఆఫర్లను పోల్చుకుని సరైన డీల్‌ను ఎంచుకోవడం ద్వారా పండుగ షాపింగ్‌ను నిజమైన లాభదాయకమైన సౌజాగా మార్చుకోవచ్చు.

Tags: