GST 2.0 : అన్ని కార్ల ధరలు ఒకేసారి తగ్గాయి.. ఏ కారు కొంటే లాభమో తెలుసా ?
ఏ కారు కొంటే లాభమో తెలుసా ?
GST 2.0 : కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆటోమొబైల్స్, వాటి విడిభాగాలపై ఉన్న జీఎస్‌టీని 28 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రభుత్వ ఈ నిర్ణయంతో మారుతి సుజుకి నుంచి ఆడి వరకు అన్ని కంపెనీల కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో పెద్ద మార్పు తీసుకురానుంది. దేశంలోని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఈ జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని నిర్ణయించాయి. దీనితో కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి.
ఏ కంపెనీ కార్ల ధర ఎంత తగ్గుతుంది?
మారుతి సుజుకి: మారుతి కార్ల ధరలు రూ. 1.29 లక్షల వరకు తగ్గుతాయి. ఉదాహరణకు, రూ. 4 లక్షల విలువైన ఎస్ ప్రెస్సో కారు ధర ఏకంగా రూ. 1.29 లక్షలు తగ్గనుంది. ఆల్టో కే10 ధర కూడా రూ.లక్షకు పైగా తగ్గుతుంది. అత్యధికంగా అమ్ముడయ్యే స్విఫ్ట్ కారు ధర రూ. 84,600 వరకు తగ్గనుంది.
టాటా మోటార్స్: టాటా నెక్సాన్, హ్యారియర్, సఫారి వంటి 1200 సీసీ కంటే పెద్ద ఇంజిన్ ఉన్న కార్ల ధరలు రూ.లక్షకు పైగా తగ్గుతాయి. ఆల్ట్రోజ్, టియాగో, టైగోర్, పంచ్ వంటి చిన్న కార్ల ధరలు రూ. 85,000 వరకు తగ్గుతాయి.
మహీంద్రా: థార్, స్కార్పియో, బొలెరో, ఎక్స్‌యూవి వంటి ప్రముఖ మహీంద్రా మోడల్స్ ధరలు కూడా తగ్గుతాయి.
హ్యుండాయ్: హ్యుండాయ్ తన కార్ల ధరలను ఏకంగా రూ. 2.4 లక్షల వరకు తగ్గించింది. ఐ10, ఔరా, క్రెటా, అల్కాజర్ వంటి పాపులర్ మోడల్స్ ధరలు రూ. 70,000 పైగా తగ్గుతాయి.
లగ్జరీ కార్లు: లగ్జరీ కార్ల ధరలు మరింత భారీగా తగ్గనున్నాయి. టాటా యాజమాన్యంలోని ల్యాండ్ రోవర్ కార్ల ధరలు రూ. 30 లక్షల వరకు తగ్గనున్నాయి. అలాగే, ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రీమియం బ్రాండ్‌ల కార్ల ధరలు కూడా రూ. 30 లక్షల వరకు తగ్గనున్నాయి. కియా, రెనో, నిస్సాన్, టయోటా, హోండా, ఎంజీ, వోల్క్స్ వాగన్, స్కోడా, జీప్, సిట్రోయెన్, బీఎండబ్ల్యూ, జాగ్వార్ వంటి ఇతర కంపెనీల కార్ల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయి.
అక్టోబర్‌లో రికార్డు అమ్మకాలు!
జీఎస్‌టీ తగ్గింపు కోసం వినియోగదారులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కార్ల అమ్మకాలు కాస్త తగ్గాయి. అయితే, ధరలు తగ్గిన వెంటనే, అక్టోబర్ నెలలో కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి, కొత్త కారు కొనేవారు ఆ రోజు వరకు వేచి ఉంటే భారీగా లాభపడవచ్చు.