Tata Punch: కారు కొనుగోలుదారులకు గట్టి షాక్: భారీగా పెరిగిన టాటా పంచ్, పంచ్ ఈవీ ధరలు!
టాటా పంచ్, పంచ్ ఈవీ ధరలు!
Tata Punch: టాటా మోటార్స్ తమ పాపులర్ ఎస్‌యూవీ కార్ల ప్రియులకు షాక్ ఇచ్చింది. మార్కెట్లో అత్యంత ఆదరణ పొందుతున్న టాటా పంచ్, పంచ్ ఈవీ ధరలను కంపెనీ పెంచింది. ఎలాంటి కొత్త ఫీచర్లు, అప్‌డేట్లు లేకుండానే ఈ ధరల పెంపు జరగడం గమసార్హం.పెట్రోల్, సీఎన్‌జీ మోడళ్లపై రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ధరలు పెరిగాయి. దీనితో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.75 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్‌కు రూ.10.77 లక్షల వరకు చేరుకుంది. ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కొత్త కారు తీసుకోవాలనుకునే వారు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఎలక్ట్రిక్ వెర్షన్ విషయానికి వస్తే, టాటా పంచ్ ఈవీ ధరలు వేరియంట్లను బట్టి రూ.20,000 వరకు పెరిగాయి. 30kWh, 40kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభించే ఈ ఈవీ ధరలు ఇప్పుడు రూ.9.79 లక్షల నుంచి రూ.12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. చిన్న బ్యాటరీ వేరియంట్లు రూ. 10,000 వరకు ఖరీదు పెరగగా, పెద్ద 40kWh బ్యాటరీ ప్యాక్ గల స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్ వంటి వేరియంట్లు నేరుగా రూ. 20,000 వరకు భారం పడ్డాయి.
ధరలు పెరిగినప్పటికీ, కంపెనీ ఈ కార్లలో ఎలాంటి మెకానికల్ మార్పులు గానీ, కొత్త ఫీచర్లు గానీ చేర్చలేదు. పాత ఫీచర్లు, పవర్‌ట్రెయిన్‌తోనే ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. పెట్రోల్, సీఎన్‌జీతో పాటు ఎలక్ట్రిక్ రూపంలో కూడా ఇది అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడళ్లలో మాన్యువల్, ఏఎంటీ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఈవీ మోడల్ చిన్న బ్యాటరీతో 375 కిమీ రేంజ్ ఇస్తే, 40kWh బ్యాటరీ వెర్షన్ ఏకంగా 468 కిమీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూనే ఉంది. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలలో టాటా మొదటి స్థానంలో నిలిచింది. ఈ విజయానికి పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ కీలక కారణాలుగా నిలిచాయి. ఏదేమైనా కార్ల ధరల పెంపు నిర్ణయం మధ్యతరగతి కారు కొనుగోలుదారులపై కొంత ప్రభావం చూపనుంది.