Tata Punch: దేశంలో నంబర్-1 ఎస్‌యూవీగా దూసుకుపోతున్న టాటా పంచ్
టాటా పంచ్
Tata Punch: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల క్రేజ్ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా కార్ల కంపెనీలు అత్యాధునిక ఫీచర్లతో వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. తాజాగా ఆర్థిక సంవత్సరం 2027 తొలి అర్ధభాగం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు) అమ్మకాలకు సంబంధించిన రిపోర్ట్ వెలువడింది. ఈ విక్రయాల జాబితాలో టాటా మోటార్స్‌కు చెందిన ప్రముఖ చిన్న ఎస్యూవీ టాటా పంచ్ ఏకంగా 1,23,287 యూనిట్ల అమ్మకాలతో దేశంలోనే నంబర్-1 ఎస్‌యూవీగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే దీని విక్రయాలు దాదాపు 67.84 శాతం మేర భారీగా వృద్ధి చెందాయి.
అమ్మకాల రేసులో టాటా మోటార్స్‌కు చెందిన మరో పాపులర్ మోడల్ టాటా నెక్సాన్ అద్భుతమైన టాలెంట్ కనబరిచింది. ఈ కాలంలో 1,11,919 యూనిట్ల విక్రయాలతో ఇది రెండో స్థానంలో నిలిచింది. వార్షిక ప్రాతిపదికన దీని అమ్మకాలు 24.97 శాతం పెరిగాయి. ఇక మూడో స్థానంలో మారుతి సుజుకీకి చెందిన ఫ్రాంక్స్ నిలిచింది. స్టైలిష్ లుక్, ఈజీ డ్రైవింగ్ అనుభవం కారణంగా ఈ కారు 1,10,135 యూనిట్ల సేల్స్‌తో 43.40 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒకే కంపెనీ నుంచి రెండు మోడళ్లు టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషం.
నాలుగో స్థానంలో మహీంద్రా సంస్థకు చెందిన స్కార్పియో రేంజ్ నిలిచింది. ఈ పవర్ఫుల్ ఎస్యూవీ మొత్తం 93,488 యూనిట్లు అమ్ముడై 10.46 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు ఎప్పుడూ ముందుండే హ్యుందాయ్ క్రెటా 89,727 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానానికి పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే క్రెటా అమ్మకాల్లో దాదాపు 9.68 శాతం క్షీణత కనిపించడం గమనార్హం.
ఈ సేల్స్ జాబితాలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే, ఎప్పుడూ టాప్ స్థానాల్లో ఉండే మారుతి సుజుకీ బ్రెజ్జా ఈసారి ఏకంగా ఆరో స్థానానికి పడిపోయింది. జూన్ నెలలో ఈ కారు నూతన అప్డేటెడ్ మోడల్ మార్కెట్లోకి ప్రవేశించింది. మోడల్ మారుతున్న సమయంలో ప్రొడక్షన్ అలాగే హోల్‌సేల్ విక్రయాల ప్రక్రియ మందగించడం వల్ల ఈ తాత్కాలిక తగ్గుదల నమోదు కావాల్సి వచ్చింది. రాబోయే పండుగ సీజన్లలో బ్రెజా తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.