Ultraviolette: సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 343 కిమీ రేంజ్..మార్కెట్లో అల్ట్రావయోలెట్ కొత్త బైక్
అల్ట్రావయోలెట్ కొత్త బైక్
Ultraviolette: భారతీయ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ప్రముఖ తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. అత్యంత పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఎక్స్-47 వీనమ్ నూతన మోడల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధరను కంపెనీ రూ.2.65 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. అయితే ఈ ప్రత్యేక ధర మొదటి 5,000 మంది కస్టమర్లకు మాత్రమే లభించనుంది. ఆ తర్వాత దీని సాధారణ ధర రూ.3 లక్షల నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 22 నుంచే బుకింగ్స్ షురూ కాగా, నవంబర్ నెల నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
అల్ట్రావయోలెట్ సంస్థ సరికొత్తగా అభివృద్ధి చేసిన VX-100 ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇదే కావడం విశేషం. ఈ అత్యాధునిక టెక్నాలజీ వల్ల బ్యాటరీ, మోటార్, కంట్రోలర్ సమర్థత పెరిగి వాహనం బరువు గణనీయంగా తగ్గింది. బైక్ మొత్తం బరువు 180 కిలోగ్రాములుగా ఉంది. ఇది మునుపటి జనరేషన్ మోడళ్లతో పోలిస్తే దాదాపు 20 కిలోగ్రాములు తక్కువ. ఇందులో ఉపయోగించిన నూతన బ్యాటరీ 15 శాతం తేలికగా ఉండటమే కాకుండా, శక్తిని నిల్వ చేసే సామర్థ్యం 25 శాతం పెరిగింది. అలాగే ఇంజిన్ కూలింగ్ వ్యవస్థను రెట్టింపు స్థాయిలో బలోపేతం చేశారు.
ఈ ఎలక్ట్రిక్ బైక్ 7kWh, 11kWh అనే రెండు రకాల బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 11kWh పెద్ద బ్యాటరీ కలిగిన మోడల్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 343 కిలోమీటర్ల ఐడీసీ (IDC) రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో అమర్చిన 30kW ఎలక్ట్రిక్ మోటార్ దాదాపు 40 bhp పవర్, 550Nm గరిష్ట టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం విషయానికి వస్తే కేవలం 2.7 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని, 5.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 155 కిలోమీటర్లుగా ఉంది. ఇది 12kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
రక్షణ విభాగంలో ఎక్స్-47 వీనమ్ నూతన ప్రమాణాలు నెలకొల్పింది. కంపెనీ ప్రవేశపెట్టిన హైపర్ సెన్స్ సేఫ్టీ సిస్టమ్ లో 77GHz రియర్ రాడార్ అమర్చారు. ఇది బైక్ వెనుక వైపు 200 మీటర్ల దూరం వరకు ఉండే కదలికలను పరిశీలిస్తుంది. దీనిద్వారా బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ చేంజ్ అసిస్ట్, ఓవర్టేక్ అలర్ట్, వెనుక నుంచి ముప్పు పొంచి ఉన్నప్పుడు హెచ్చరికలు లభిస్తాయి. డాష్ బోర్డ్ మీద 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, మ్యాప్ప్లస్ నావిగేషన్, పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్ సదుపాయాలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగితే అలర్ట్ పంపే వయొలెట్ ఏఐ టెక్నాలజీ కూడా ఉంది.