Tata Sierra Dark Edition: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ సియెర్రాలో సరికొత్త డార్క్ ఎడిషన్‎ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఎక్స్ షోరూమ్ వద్ద దీని ప్రారంభ ధరను రూ.13.99 లక్షలుగా నిర్ణయించగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.20.59 లక్షల వరకు ఉంటుంది. ఈ కొత్త ఎడిషన్‌లో కంపెనీ ఎస్‌యూవీ ఎక్స్ టీరియర్ డిజైన్, ఇంటీరియర్‌ను మరింత ఆకర్షణీయంగా, పూర్తిగా డార్క్, ప్రీమియం లుక్‌తో తీర్చిదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

సియెర్రా డార్క్ ఎడిషన్‌ను పూర్తిగా ఆకర్షణీయమైన బ్లాక్ ఎక్స్‌టీరియర్‌తో మార్కెట్లోకి తెచ్చారు. ఇందులో ప్రత్యేకమైన ఫ్రీసియన్ బ్లాక్ పెయింట్ ఆప్షన్ ఇచ్చారు. ఫ్రంట్, రియర్ బంపర్లపై సాటిన్ మిడ్‌నైట్ బ్లాక్ ఫినిషింగ్ లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో 19 అంగుళాల జెట్ పియానో బ్లాక్ అలాయ్ వీల్స్‌ను డైమండ్-కట్ డిజైన్, టింటెడ్ బ్లాక్ ఫినిషింగ్‌తో అమర్చారు. బాహ్య భాగంలో వచ్చే TATA లోగో, గ్రిల్ సియెర్రా బ్యాడ్జ్, టెయిల్‌గేట్ మస్కట్ వంటి ప్రతి అంశాన్ని డార్క్ క్రోమ్, పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో తీర్చిదిద్దడం ఈ కారు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఈ ఎస్‌యూవీ లోపలి భాగానికి వస్తే, కంపెనీ ఇందులో అద్భుతమైన వయోలెట్ ఎక్లిప్స్ థీమ్‌ను ఉపయోగించింది. దీని బేస్ కలర్ బ్లాక్ ఉండగా, సీట్లు, డాష్‌బోర్డ్, ఆర్మ్‌రెస్ట్ లపై గ్రేనైట్ బ్లాక్ ఆర్ట్ లెదర్ ఇచ్చారు. దీనికి తోడు పర్పుల్ కలర్ స్టిచింగ్, ఎయిర్ వెంట్లు, ఫ్రంట్ డోర్లపై పర్పుల్ ఇన్‌సర్ట్‌లు కారు ఇంటీరియర్‌కు రాయల్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా ఫ్రంట్ కన్సోల్, స్టీరింగ్ వీల్, హెడ్‌రెస్ట్‌లపై ప్రత్యేకమైన డార్క్ గ్రాఫిక్స్ ఇవ్వడం ద్వారా దీనిని రెగ్యులర్ మోడల్ కంటే చాలా భభిన్నంగా తీర్చిదిద్దారు.

ఈ డార్క్ ఎడిషన్‌ను కేవలం టాప్ మోడల్‌కే పరిమితం చేయకుండా ప్యూర్ ఎల్ నుంచి అకాంప్లిష్డ్+ వరకు అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంచారు. వీటిలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS వంటి అధునాతన భద్రతా ఫీచర్లు లభిస్తాయి. ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే 1.5-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్, 1.5-లీటర్ క్రయోజనిక్ డీజిల్, 1.5-లీటర్ హైపెరియన్ టర్బో-పెట్రోల్ అనే మూడు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో పాటు మాన్యువల్, ఆటోమొబైల్ గేర్‌బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

Tags: