Tata Sierra : టాటా సియెర్రా గ్రాండ్ రివీల్ నేడే..డిజైన్, ఫీచర్లలో ఏముంది ప్రత్యేకత?
డిజైన్, ఫీచర్లలో ఏముంది ప్రత్యేకత?
Tata Sierra : 90వ దశకంలో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టాటా సియెర్రా ఎస్‌యూవీ తిరిగి వస్తోంది. పాత సియెర్రా అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు టాటా మోటార్స్ తెరదించుతూ, ఈ ఐకానిక్ ఎస్‌యూవీ సరికొత్త మోడల్‌ను ఈరోజు ముంబైలో ప్రపంచానికి పరిచయం చేయనుంది. పాత డిజైన్‌ను గుర్తు చేస్తూనే, ట్రిపుల్ స్క్రీన్, ADAS వంటి అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న కొత్త సియెర్రా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
కొత్త సియెర్రాను టాటా మోటార్స్ పూర్తిగా ఆధునికమైన, కుటుంబానికి సరిపోయే ఎస్‌యూవీగా తయారు చేసింది. పాత సియెర్రాలో ఉన్న 3-డోర్ల డిజైన్‌కు బదులుగా, ఈసారి మరింత మెరుగైన 5-డోర్ల లేఅవుట్ ఇవ్వడం జరిగింది. అయితే సియెర్రాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఆల్పైన్ విండో డిజైన్‌ను మాత్రం ఆధునిక టచ్‌తో కొనసాగించారు. ఇందులో మస్క్యులర్ లుక్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED లైటింగ్, డోర్లలో ఫ్లష్ హ్యాండిల్స్ వంటివి డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.
ఫీచర్ల విషయంలో కొత్త సియెర్రా చాలా ప్రీమియంగా ఉండనుంది. ఇందులో డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, OTA అప్‌డేట్ సపోర్ట్ వంటివి ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రత్యేకత ఏమిటంటే.. టాటా మోటార్స్ తమ కార్లలో మొదటిసారిగా ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌ను ఇస్తోంది. ఇందులో రెండు 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలు, ఒక 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంది.సేఫ్టీ కోసం అత్యాధునికమైన లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ కూడా ఇందులో లభిస్తుంది.
కొత్త టాటా సియెర్రా పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు, ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
పెట్రోల్: ఇందులో 1.5 లీటర్ సాధారణ, 1.5 లీటర్ టర్బోచార్జ్‌డ్ ఇంజిన్లు వచ్చే అవకాశం ఉంది.
డీజిల్: హారియర్ నుంచి తీసుకున్న 2.0 లీటర్ ఇంజిన్ లేదా కర్వ్ నుంచి తీసుకున్న 1.5 లీటర్ ఇంజిన్ ఉండవచ్చు.
ఎలక్ట్రిక్ : సియెర్రా ఈవీ వేరియంట్‌లో, సుమారు 65 kWh బ్యాటరీ ప్యాక్, దాదాపు 600 కి.మీ.ల రేంజ్ లభించే అవకాశం ఉంది.
అందుతున్న నివేదికల ప్రకారం.. కొత్త టాటా సియెర్రా ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర సుమారు రూ.11 లక్షల నుంచి ఉండే అవకాశం ఉంది. అయితే, ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్లను బట్టి టాప్ మోడల్ ధర మరింత అధికంగా ఉండవచ్చు. ఈరోజు ముంబైలో జరగనున్న గ్రాండ్ రివీల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.