Tesla : టెస్లా కార్లు అంటే మృత్యు పాశాలా ? డోర్లు రాక 15 మంది బలి

డోర్లు రాక 15 మంది బలి

Update: 2025-12-25 12:54 GMT

Tesla : ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన తాజా పరిశోధనా నివేదిక ప్రకారం... టెస్లా కార్ల డోర్ల డిజైన్‌లో ఉన్న లోపాల వల్ల ఇప్పటివరకు కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. ఈ మరణాలన్నీ ప్రమాదం జరిగిన తర్వాత కారు డోర్లు తెరుచుకోకపోవడం వల్లే సంభవించాయని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా 2024 నవంబర్ తర్వాతే సగానికి పైగా మరణాలు సంభవించడం గమనార్హం.

టెస్లా కార్లు తమ స్టైలిష్ లుక్ కోసం సంప్రదాయ మెకానికల్ హ్యాండిల్స్ కాకుండా, ఎలక్ట్రానిక్ బటన్ల ద్వారా పనిచేసే డోర్లను ఉపయోగిస్తాయి. ఇవి కారులోని 12-వోల్ట్ బ్యాటరీ సహాయంతో పనిచేస్తాయి. అయితే ఏదైనా భారీ ప్రమాదం జరిగినప్పుడు ఈ బ్యాటరీ దెబ్బతిన్నా లేదా డిస్‌కనెక్ట్ అయినా, ఈ ఎలక్ట్రానిక్ బటన్లు పూర్తిగా పనిచేయవు. దీనివల్ల లోపల ఉన్నవారు బయటకు రాలేక, బయట ఉన్న రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్లలేక పోతున్నారు. కారులో మంటలు చెలరేగినప్పుడు ఈ డోర్లు డెత్ ట్రాప్ గా మారుతున్నాయని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

నిజానికి టెస్లా కార్లలో అత్యవసర సమయాల్లో డోర్లు తెరవడానికి మాన్యువల్ లివర్స్ ఉంటాయి. కానీ, అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించడం చాలా కష్టమని నివేదిక పేర్కొంది. మోడల్ 3, మోడల్ Y వంటి కార్లలో వెనుక సీట్ల వద్ద ఉన్న మాన్యువల్ లివర్లు కార్పెట్ కింద లేదా డోర్ పాకెట్ల లోపల దాగి ఉంటాయి. పొగతో నిండిన కారులో, ప్రాణ భయంతో ఉన్న వ్యక్తి ఆ లివర్లను వెతకడం దాదాపు అసాధ్యం. దీనిపై అమెరికా సేఫ్టీ ఏజెన్సీ (NHTSA) ఇప్పటికే సుమారు 1.8 లక్షల టెస్లా మోడల్ 3 కార్లపై విచారణ ప్రారంభించింది.

టెస్లా ఇంజనీర్లు 2017లోనే ఈ ఎలక్ట్రిక్ డోర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎలన్ మస్క్ ను హెచ్చరించినట్లు సమాచారం. అయితే కారు లోపలి భాగం చూడటానికి ఫ్యూచరిస్టిక్ గా, అందంగా ఉండాలనే ఉద్దేశంతో మస్క్ ఆ హెచ్చరికలను పక్కన పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. సేఫ్టీ కంటే డిజైన్ కే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా, విస్కాన్సిన్ వంటి ప్రాంతాల్లో టెస్లాపై అనేక క్రిమినల్, సివిల్ కేసులు నమోదయ్యాయి.

టెస్లా సమాధానం ఏమిటి?

ఈ ఆరోపణలపై టెస్లా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే కంపెనీ తన వెబ్‌సైట్‌లో కొత్త సేఫ్టీ పేజీని జత చేసింది. ప్రమాదం జరిగినప్పుడు డోర్లు ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అయ్యేలా కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కానీ, బ్యాటరీ పూర్తిగా ఫెయిల్ అయినప్పుడు ఈ సిస్టమ్ పనిచేస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. పాత కార్ల యజమానులకు ఈ అప్‌డేట్ అందుతుందో లేదో కూడా తెలియదు. ఏది ఏమైనా, టెస్లా డోర్ల వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ భద్రతా ప్రమాణాలపై కొత్త చర్చకు దారితీసింది.

Tags:    

Similar News