Tesla : సామాన్యుల కోసం చౌకైన ఎలక్ట్రిక్ కారు.. BYD కోటను బద్దలు కొట్టేందుకు టెస్లా మాస్టర్ ప్లాన్

BYD కోటను బద్దలు కొట్టేందుకు టెస్లా మాస్టర్ ప్లాన్

Update: 2026-04-11 10:55 GMT

Tesla : ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, ఇప్పుడు సామాన్యులకు కూడా చేరువయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు కేవలం లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకే పరిమితమైన టెస్లా, చైనా దిగ్గజం BYD నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు చౌక అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అత్యంత సరసమైన ధరలో, కాంపాక్ట్ సైజులో సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురావడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో చైనా కంపెనీ BYD అమ్మకాల్లో దూసుకుపోతోంది. దీనిని అడ్డుకోవడానికి ఎలన్ మస్క్ తన పాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. గతంలో నిలిపివేసిన మోడల్ 2 వంటి తక్కువ ధర ఈవీ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించారు. మీడియా నివేదికల ప్రకారం, టెస్లా ఒక సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని రూపొందిస్తోంది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెస్లా కార్లన్నింటికంటే తక్కువ ధరకే లభించనుంది. సామాన్య ప్రజలకు కూడా టెస్లా కారును సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించడమే మస్క్ ప్రధాన లక్ష్యం.

ఈ కొత్త కారు కేవలం పాత మోడల్స్ కు చిన్న వెర్షన్ కాదు. ఇది పూర్తిగా సరికొత్త డిజైన్ తో రాబోతోంది. దీని పొడవు సుమారు 4.28 మీటర్లు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం పాపులర్ గా ఉన్న మోడల్ వైతో పోలిస్తే ఇది దాదాపు అర మీటర్ తక్కువ. బరువు విషయంలో కూడా టెస్లా జాగ్రత్తలు తీసుకుంటోంది. మోడల్ వై సుమారు 2 టన్నుల బరువు ఉంటే, ఈ కొత్త ఎస్‌యూవీని కేవలం 1.5 టన్నులకే పరిమితం చేయాలని చూస్తోంది. బరువు తగ్గడం వల్ల తయారీ ఖర్చు తగ్గడమే కాకుండా, కారు ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది.

ధరను తగ్గించే క్రమంలో టెస్లా కొన్ని కీలక మార్పులు చేస్తోంది. ఈ ఎస్‌యూవీలో చిన్న బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించే అవకాశం ఉంది. దీనివల్ల డ్రైవింగ్ రేంజ్ ప్రస్తుతం ఉన్న కార్లకంటే (సుమారు 526 కి.మీ) కొంచెం తక్కువగా ఉండవచ్చు. అలాగే, చాలా టెస్లా కార్లలో ఉండే డ్యూయల్ మోటార్ సెటప్ కు బదులుగా, కేవలం సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ను మాత్రమే అమర్చే అవకాశం ఉంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు తగ్గుతాయి. కారు ధర సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది.

టెస్లా ఈ కొత్త మోడల్ తో నేరుగా చైనా దిగ్గజం BYD ని ఢీకొట్టబోతోంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ద్వారా ధరను భారీగా తగ్గించాలని మస్క్ భావిస్తున్నారు. ఈ కొత్త ఎస్‌యూవీ ఉత్పత్తి మొదట టెస్లా షాంఘై (చైనా) ఫ్యాక్టరీలో ప్రారంభం కానుందని సమాచారం. ఆ తర్వాత అమెరికా, యూరప్ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా అక్కడ కూడా తయారీని మొదలుపెడతారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉంది. లాంచ్ తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఆటోమొబైల్ ప్రేమికులు మాత్రం ఈ చౌక టెస్లా కారు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News