Triumph: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ భారత మార్కెట్లోకి సరికొత్త బోనెవిల్లే T4 మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ వద్ద ఈ బైక్ ప్రారంభ ధరను రూ.2.54 లక్షలుగా నిర్ణయించారు. ట్రయంఫ్ బోనెవిల్లే కుటుంబంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న T40 మోడల్ కంటే తక్కువ ధరలో, అత్యంత సరసమైన వేరియంట్‌గా దీనిని తీసుకొచ్చారు. క్లాసిక్ డిజైన్, ఆధునిక ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ భారతీయ రోడ్లపై రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌కు గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధమైంది.

ఈ కొత్త బోనెవిల్లే T4 ఓవరాల్ డిజైన్, రైడింగ్ పొజిషన్ T40 మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక కాస్మోటిక్ మార్పులు చేశారు. కస్టమర్లను ఆకట్టుకునేలా ఫాంటమ్ బ్లాక్, కార్నివాల్ రెడ్, కాంపిటీషన్ గ్రీన్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఈ బైక్ లభిస్తుంది. ట్రయంఫ్ సంస్థ ఈ మోడల్ కోసం వినూత్న స్టైల్ బ్రాండింగ్ ఉపయోగించింది. ఈ బైక్ ఆన్‌లైన్ బుకింగ్స్ అక్టోబర్ 7 నుంచే ప్రారంభం కాగా, కస్టమర్లకు 2027 జనవరి రెండో వారం నుంచి డెలివరీలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బోనెవిల్లే T40 మోడల్‌లో టీఎఫ్టీ స్క్రీన్ ఉండగా, ఈ కొత్త T4 మోడల్‌లో కలర్ ఎల్‌సిడి డిస్‌ప్లేను అమర్చారు. చిన్న స్క్రీన్ అయినప్పటికీ ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నేవిగేషన్ సౌకర్యాలను కల్పించారు. రైడర్లు హ్యాండిల్‌బార్‌పై ఉన్న బటన్ల ద్వారా కాల్స్, కాంటాక్ట్స్ నిర్వహించుకోవచ్చు. రాత్రి వేళల్లో మెరుగైన వెలుతురు కోసం ఫుల్-ఎల్‌ఈడి లైటింగ్, డే-టైమ్ రన్నింగ్ లైట్స్ (DRL) సదుపాయంతో పాటు అత్యవసర సమయాల్లో హెచ్చరించే ఎమర్జెన్సీ డిసెలరేషన్ వార్నింగ్ సిస్టమ్ కూడా ఇందులో పొందుపరిచారు.

ఈ బైక్‌లో 350cc సామర్థ్యం గల సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది ట్రయంఫ్ ప్రాచుర్యం పొందిన TR-సిరీస్ ఇంజిన్ కుటుంబానికి చెందినది. తక్కువ ఆర్‌పిఎమ్‌లోనూ ఎక్కువ టార్క్ ఇచ్చేలా కొత్త సిలిండర్ హెడ్, ప్రత్యేక ఇంజిన్ ట్యూనింగ్ చేశారు. ఈ ఇంజిన్ 28.2 bhp పవర్, 31 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వివిధ రకాల రోడ్ల పరిస్థితికి తగినట్లుగా రోడ్, రెయిన్, ఈకో అనే మూడు రైడింగ్ మోడ్స్‌ ఇచ్చారు. ఇవి థ్రోటల్ రెస్పాన్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ పనితీరును నియంత్రిస్తాయి.

మెరుగైన రైడింగ్ అనుభూతి కోసం ఈ బైక్‌లో సరికొత్త ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు. బ్రేకింగ్ విభాగంలో ముందు వైపు డిస్క్ బ్రేక్ విత్ ట్విన్-పిస్టన్ కాలిపర్ అమర్చారు. అత్యవసర సమయంలో బైక్ అదుపు తప్పకుండా ఉండేందుకు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సిస్టమ్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించడం విశేషం.

Tags: