TVS : ఓలా, ఏథర్ లకు షాక్.. అమ్మకాల్లో దూసుకుపోతున్న టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్
అమ్మకాల్లో దూసుకుపోతున్న టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్;
TVS : చైనా రేర్ ఎర్త్ మాగ్నెట్‌లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడంతో భారతీయ ఆటో పరిశ్రమకు పెద్ద ఊరట లభించింది. ఈ నిషేధం ఏప్రిల్‌లో మొదలై ఆగస్టు వచ్చేసరికి చాలా కంపెనీలపై ప్రభావం చూపింది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలపైనా దాని ప్రభావం కనిపించింది. ఆగస్టు నెలలో గత మూడు నెలలతో పోలిస్తే అమ్మకాలు తగ్గాయి. వాహన్ పోర్టల్ ప్రకారం.. ఆగస్టు 1 నుండి 15 వరకు 44,618 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన ఆగస్టు చివరి నాటికి మొత్తం అమ్మకాలు లక్ష యూనిట్ల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఈ తక్కువ అమ్మకాల మధ్య కూడా ఎలక్ట్రిక్ టూ-వీలర్ల కంపెనీల ర్యాంకింగ్‌లలో పెద్ద మార్పు వచ్చింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఆగస్టు నెలలో కూడా తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ నుండి జూలై వరకు వరుసగా నాలుగు నెలల పాటు టీవీఎస్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది. ఆగస్టు 1 నుండి 15 వరకు టీవీఎస్ 11,160 ఐక్యూబ్ స్కూటర్లను అమ్మింది, దీంతో మార్కెట్‌లో దాని వాటా 25%గా ఉంది. 2024లో ఐక్యూబ్ అమ్మకాల రికార్డు 2,20,813 యూనిట్లు కాగా, ఈ ఏడాది జనవరి 1 నుండి ఆగస్టు 15 వరకు టీవీఎస్ ఇప్పటికే 1,77,515 ఐక్యూబ్‌లను అమ్మింది, ఇది గత ఏడాది అమ్మకాలలో 80% కావడం విశేషం.
ఆగస్టు 2025లో ఏథర్ ఎనర్జీ రెండో స్థానానికి దూసుకెళ్లింది. బెంగళూరుకు చెందిన ఈ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ 7,639 యూనిట్లను విక్రయించి, 17% మార్కెట్ వాటాను సాధించింది. ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం చాలా బాగా రాణిస్తోంది. ఆగస్టు మొదటి పదిహేను రోజుల్లోనే దాని మొత్తం అమ్మకాలు లక్ష యూనిట్ల మార్కును దాటాయి. 9 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును దాటిన ఓలా ఎలక్ట్రిక్, ఆగస్టులో మూడో స్థానంలో ఉంది. ఆగస్టు మొదటి 15 రోజుల్లో ఈ సంస్థ 6,229 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దాని మార్కెట్ వాటా 14%గా ఉంది. చాలా కాలం పాటు ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఓలా చివరిసారిగా జనవరి 2025లో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చిలో బజాజ్ ఆటో, ఏప్రిల్, మే, జూన్, జూలైలో టీవీఎస్ మొదటి స్థానంలో నిలిచాయి.