Hero MotoCorp : టీవీఎస్, ఓలాకు ఇక చుక్కలే.. రూ.లక్షలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ తెస్తున్న హీరో
రూ.లక్షలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ తెస్తున్న హీరో;
Hero MotoCorp : ప్రముఖ టూ-వీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ విడా త్వరలోనే మార్కెట్‌లో ఒక చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయబోతోంది. విడా ఇప్పటికే విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్ముతోంది. ఇవి V2 ప్రో, V2 ప్లస్, V2 లైట్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు విడా V2 కంటే తక్కువ ధరలో ఉండే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ VX2 లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. జులై 1న లాంచ్ కాబోతున్న విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా సరసమైన ధరలో ఉంటుంది. భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో ఈ కొత్త స్కూటర్ టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో , ఓలా ఎలక్ట్రిక్, ఎథర్ ఎనర్జీ వంటి కంపెనీలకు గట్టి పోటీనిస్తుంది.
విడా VX2లో విడా V2 లాంటి ఫీచర్లు ఉంటాయి. ఇందులో 2.2 kWh నుండి 3.4 kWh యూనిట్ల వరకు వివిధ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే VX2 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, రేంజ్ అనేది బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ను బట్టి మారుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సులభంగా ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవడానికి లేదా బ్యాటరీలను మార్చుకోవడానికి వీలుగా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి.
విడా VX2 ప్రారంభ ధర సుమారు లక్ష (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. అయితే, కంపెనీ ఇప్పటికే ఒక విషయం వెల్లడించింది. VX2 బ్యాటరీ-యాస్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్ తో వస్తుంది. ఇది కొనుగోలుదారులకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో లభిస్తుంది. దీని ద్వారా కస్టమర్లు బ్యాటరీని విడిగా సబ్‌స్క్రైబ్ చేసుకోగలరు. అంటే, వారు కిలోమీటర్‌కు లెక్కన స్కూటర్ నడపడానికి బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చు. ఈ BaaS మోడల్ లో స్కూటర్ ధర దాదాపు రూ.70,000(ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని కంపెనీ చెబుతోంది.
విడా VX2ని ఆన్‌లైన్‌లో ఒక టీజర్ వీడియో ద్వారా చూపించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, EICMA 2024లో చూపించిన విడా Z ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ లాగే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది V2 లాంటి డిజైన్‌తో వస్తుంది. అయితే, ఇందులో కొన్ని ప్రత్యేకమైన స్టైలింగ్ ఎలిమెంట్లు కూడా ఉంటాయి. ముందు, వెనుక ఎల్‌ఈడీ లైటింగ్ ఉంటుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ ఇండికేటర్లు, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌లో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. ఇందులో ఒక ఫ్లాట్ సీటు, హ్యాండిల్‌బార్‌పై బేసిక్ టాగుల్ బటన్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి.