India US Trade : భారత ఎగుమతులకు అమెరికా షాక్.. సెక్షన్ 301 అస్త్రంతో కొత్త ట్యాక్స్‌ల మోత!
సెక్షన్ 301 అస్త్రంతో కొత్త ట్యాక్స్‌ల మోత!
India US Trade : అంతర్జాతీయ వ్యాపార రంగంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రపంచ పెద్దన్న అమెరికా తీసుకున్న ఒక తాజా నిర్ణయం వల్ల గ్లోబల్ ట్రేడ్ వార్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా తన ప్రత్యేక వ్యాపార చట్టమైన సెక్షన్ 301 కింద భారత్ సహా పలు దేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీగా కొత్త ట్యాక్స్‌లు విధించాలని ప్రతిపాదించింది. అమెరికా దేశీయ కంపెనీలకు నష్టం కలిగించేలా లేదా అన్యాయంగా సాగుతున్న ఇతర దేశాల వాణిజ్య విధానాలపై ఈ చట్టం కింద దర్యాప్తు చేస్తారు. ఈ దర్యాప్తు తర్వాత, అమెరికా ప్రభుత్వం తన ప్రధాన భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే సరుకులపై అదనపు సుంకాలు విధించడానికి సిద్ధమైంది. దీనివల్ల భారత్ ద్వైపాక్షిక వ్యాపారంతో పాటు ఎగుమతుల ఖర్చులు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉంది.
యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) బుధవారం రోజున సెక్షన్ 301 దర్యాప్తుకు సంబంధించిన 60 కీలక ఫలితాలను విడుదల చేసింది. కార్మికులతో బలవంతంగా వెట్టిచాకిరీ చేయించి తయారు చేసిన వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు గాను.. భారత్‌తో పాటు మరో 53 దేశాల ఉత్పత్తులపై ఏకంగా 12.5 శాతం అదనపు టారిఫ్ విధించాలని ఈ నివేదికలో ప్రతిపాదించారు. అయితే ఈ షాకింగ్ ప్రకటన సరిగ్గా ఎప్పుడు వచ్చిందంటే.. అమెరికా ముఖ్య వాణిజ్య ప్రతినిధులు, భారత అధికారులతో కలిసి న్యూఢిల్లీలో ఒక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి మూడు రోజుల చర్చలు జరుపుతున్న సమయంలోనే రావడం గమనార్హం.
ఈ పరిణామాలపై ఒక ఉన్నతాధికారి స్పందిస్తూ.. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న చర్చల్లో భారత ప్రతినిధులు ముఖ్యంగా ఈ సెక్షన్ 301 నివేదిక నుంచి ఉపశమనం పొందడం, ఇతర దేశాల కంటే తక్కువ టారిఫ్ రేట్లు సాధించడంపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. వాణిజ్య నిబంధనలు, నియామకాలు నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, సమతుల్యంగా ఉంటేనే భారత్ ఈ ఒప్పందాన్ని పక్కా చేసుకునేందుకు మొగ్గు చూపుతుందని స్పష్టం చేశారు. ఒకసారి ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక రూపకల్పన పూర్తయిన తర్వాత, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమిసన్ గ్రీర్ స్వయంగా భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
వెట్టిచాకిరీతో వస్తువులను తయారు చేస్తున్నారనే ఆరోపణలను భారతదేశం తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్ ప్రభుత్వం ఈ ఏకపక్ష దర్యాప్తులను, ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఇలాంటి అంతర్జాతీయ వాణిజ్య సమస్యలను ఏకపక్ష నిర్ణయాల ద్వారా కాకుండా, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల పరిధిలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భారత్ స్పష్టం చేసింది.
సెక్షన్ 301 అంటే.. ఇది అమెరికా ట్రేడ్ యాక్ట్, 1974 లో ఒక భాగం. ఇది అమెరికా ప్రభుత్వానికి ఒక పవర్‌ఫుల్ ఆయుధం లాంటిది. విదేశీ ప్రభుత్వాల విధానాలు లేదా పద్ధతులు అన్యాయంగా ఉన్నాయా, వివక్షతో కూడుకున్నవా, లేదా అమెరికా వ్యాపారాన్ని దెబ్బతీసేలా ఉన్నాయా అని దర్యాప్తు చేయడానికి ఇది యూఎస్‌టీఆర్‌కు పూర్తి అధికారం ఇస్తుంది. ఒకవేళ విదేశీ వాణిజ్య పద్ధతులు అన్యాయంగా ఉన్నాయని తేలితే, అమెరికా ఆయా దేశాలపై అదనపు టారిఫ్‌లు విధించవచ్చు. బుధవారం ప్రకటించిన ఈ చర్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలం మొదటి సంవత్సరంలో విధించి, ఆ తర్వాత సుప్రీంకోర్టు చేత రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయబడిన దేశాల వారీ టారిఫ్‌లను మళ్లీ ఎలాగైనా అమలు చేయాలనే ప్రయత్నంలో ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు.
అయితే ఈ కొత్త టారిఫ్‌లు ఇప్పుడే పూర్తి స్థాయిలో అమలులోకి రావు. వీటిని అధికారికంగా వర్తింపజేయడానికి ముందు సాధారణ ప్రజల, వివిధ వర్గాల అభిప్రాయాలను, వ్యాఖ్యలను సేకరించి సమీక్షిస్తారు. కాబట్టి ఫైనల్ నోటిఫికేషన్ వచ్చే సరికి ఈ పన్ను రేట్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ నివేదికపై లిఖితపూర్వక వ్యాఖ్యలను సమర్పించడానికి జూలై 6 వరకు గడువు ఇచ్చారు. జూలై 7 నుంచి సెక్షన్ 301 ప్యానెల్ బహిరంగ విచారణను ప్రారంభించనుంది.