Vinfast : టాటా, ఎంజీలకు కొత్త టెన్షన్.. త్వరలో ఇండియాలోకి చవకైన ఎలక్ట్రిక్ కారు
త్వరలో ఇండియాలోకి చవకైన ఎలక్ట్రిక్ కారు;
Vinfast : కొద్ది నెలల క్రితం భారతదేశంలో రెండు పవర్ఫుల్ ఎలక్ట్రిక్ కార్లతో అడుగుపెట్టిన వియత్నాం సంస్థ విన్ఫాస్ట్, త్వరలో ఒక చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. విన్ఫాస్ట్ ఇటీవల లిమో గ్రీన్, మినియో గ్రీన్ అనే రెండు ఎలక్ట్రిక్ కార్లకు పేటెంట్ దాఖలు చేసింది. వీటిలో ఒకటి చిన్న ఎలక్ట్రిక్ కారు కాగా, మరొకటి 7-సీటర్ ఈవీ. ఈ చిన్న కారు, ముఖ్యంగా ఎంజి కామెట్ ఈవీ, టాటా టియాగో ఈవీ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఫీచర్లు, సైజు, డిజైన్ పరంగా ఇవి కొంత భిన్నంగా ఉంటాయి. ఈ కారు కంపెనీ నుండి రాబోయే అత్యంత చౌకైన కారుగా నిలవనుంది.
విన్ఫాస్ట్ భారతీయ ఈవీ మార్కెట్‌లో ఒక పెద్ద వాటాను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే కంపెనీ ఇటీవల VF6, VF7 అనే రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లాంచ్ చేసింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత చిన్న, చౌకైన ఎలక్ట్రిక్ కారుగా ఎంజి కామెట్ ఈవీ ఉంది. దీని ప్రారంభ ధర రూ.7.50 లక్షలు, టాప్ మోడల్ ధర రూ.9.56 లక్షల వరకు ఉంటుంది. అయితే, విన్ఫాస్ట్ పేటెంట్ కోసం దాఖలు చేసిన మినియో గ్రీన్ కూడా దాదాపు అదే సైజులో ఉంటుంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ పొడవు 3,100 మి.మీ. ఇది ఎంజి కామెట్ కంటే కొంచెం పొడవుగా ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,065 మి.మీ, ఇందులో 13-అంగుళాల టైర్లు ఉంటాయి.
విన్ఫాస్ట్ మినియో గ్రీన్ కారును 14.7 kWh చిన్న బ్యాటరీ ప్యాక్‌తో తీసుకురానుంది. ఈ బ్యాటరీ 26 bhp పవర్‌ను, 65 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే మోటార్‌తో అనుసంధానించబడి ఉంటుంది. మినియో గ్రీన్ గరిష్ఠ వేగం గంటకు 80 కి.మీ. వరకు ఉండవచ్చు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది 170 కి.మీ. వరకు ప్రయాణించగలదు. ఈ రేంజ్, వేగం ఈ కారును పట్టణ ప్రాంతాలలో ఉపయోగించడానికి పర్ఫెక్ట్ ఆప్షన్‌గా మార్చనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 12kW ఏసీ ఛార్జర్‌తో రావచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఆల్-ఎల్‌ఈడీ లైట్స్, డ్యుయల్ స్పీకర్లు, నాలుగు వైపులా మాన్యువల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, రెండు డ్రైవ్ మోడ్‌లు, మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ వంటి సదుపాయాలు ఉండవచ్చు.
మినియో గ్రీన్ తో పాటు విన్ఫాస్ట్ లిమో గ్రీన్ అనే మరో కారు కోసం కూడా పేటెంట్ దాఖలు చేసింది. ఇది 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ. ఇటీవల భారతదేశంలో విడుదలైన కియా క్యారన్స్ క్లావిస్ ఈవీకి ఇది గట్టి పోటీ ఇవ్వవచ్చు. మార్చి 2025లో ఈ మోడల్ కోసం విన్ఫాస్ట్ పేటెంట్ దరఖాస్తును దాఖలు చేసింది. విన్ఫాస్ట్ లిమో గ్రీన్ పొడవు 4,700 మి.మీ, వెడల్పు 1,800 మి.మీ, ఎత్తు 1,700 మి.మీ. దీని వీల్‌బేస్ 2,800 మి.మీ. ఈ కార్ల ద్వారా భారత ఈవీ మార్కెట్లో విన్ఫాస్ట్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.