VinFast : పాత కారు ఇచ్చేయండి.. కొత్త విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్ కొట్టేయండి

కొత్త విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్ కొట్టేయండి

Update: 2026-03-11 06:41 GMT

VinFast : ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు వియత్నాంకు చెందిన ప్రముఖ దిగ్గజ సంస్థ విన్‌ఫాస్ట్ ఒక సంచలన పథకాన్ని ప్రకటించింది. ట్రేడ్ గ్యాస్ ఫర్ ఎలక్ట్రిక్ పేరుతో సరికొత్త ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఈ పథకం ద్వారా మీ దగ్గర ఉన్న పాత పెట్రోల్ లేదా డీజిల్ కార్లను ఇచ్చేసి, విన్‌ఫాస్ట్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తే భారీగా అదనపు డిస్కౌంట్లు లభిస్తాయి. భారత్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి నాలుగు ప్రధాన దేశాల్లో ఈ ఆఫర్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

ఈ ప్రత్యేక పథకం కింద కస్టమర్లకు రెట్టింపు ప్రయోజనం కలుగుతుంది. మీరు పాత కారును మార్చుకున్నప్పుడు లభించే ఎక్స్ఛేంజ్ విలువతో పాటు, కొత్త ఎలక్ట్రిక్ కారు ధరపై అదనంగా 3 శాతం రాయితీ లభిస్తుంది. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తే ఏకంగా 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. భారతీయ మార్కెట్లో విన్‌ఫాస్ట్ విక్రయిస్తున్న VF6, VF7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీనివల్ల కస్టమర్లు తమ వేరియంట్ ఎంపికను బట్టి సుమారు రూ. 50,000 నుంచి రూ. 75,000 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నిలకడగా లేకపోవడం, పెట్రోల్ భారం రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను ఈవీల వైపు మళ్ళించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విన్‌ఫాస్ట్ గ్లోబల్ ప్రతినిధి డ్యూయాంగ్ థి థు ట్రాంగ్ తెలిపారు. ఇంధనం కోసం చేసే ఖర్చును తగ్గించుకోవడంతో పాటు, పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో పెట్రోల్ ధరలు ఇలాగే పెరిగితే, ఈ పథకాన్ని మరింత కాలం పొడిగించే ఆలోచనలో కూడా యాజమాన్యం ఉంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో, విన్‌ఫాస్ట్ తన VF3, VF8, VF9 వంటి మోడళ్లను కూడా త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం టాటా సియెర్రా, మహీంద్రా BE 6 వంటి స్వదేశీ ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా విన్‌ఫాస్ట్ తన డిస్కౌంట్లను ప్రకటిస్తోంది. పాత కారును ఇచ్చేసి స్మార్ట్, గ్రీన్ కారులోకి మారాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

Tags:    

Similar News