New Launch : మహీంద్రా XUV 7XO కి గండం.. మార్కెట్లోకి వస్తున్న 4 సూపర్ ఎస్‌యూవీలు ఇవే
మార్కెట్లోకి వస్తున్న 4 సూపర్ ఎస్‌యూవీలు ఇవే
New Launch : జనం మెచ్చిన 7-సీటర్ ఎస్‌యూవీగా మహీంద్రా XUV 7XO మార్కెట్లో తిరుగులేని రారాజుగా వెలుగొందుతోంది. అద్భుతమైన ఫీచర్లు, ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్‌తో ఇది వినియోగదారుల ఫేవరెట్ లిస్టులో అగ్రస్థానంలో ఉంది. అయితే ఈ పాపులర్ మోడల్‌కు గట్టి సవాల్ విసిరేందుకు మార్కెట్లోకి సరికొత్త వాహనాలు సిద్ధమవుతున్నాయి. మీరు ఒకవేళ XUV 7XO కాకుండా ఏదైనా భిన్నమైన, ఇంకా అడ్వాన్స్‌డ్ ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే, మరో కొద్ది రోజులు ఓపిక పట్టడం మంచిది. రాబోయే రోజుల్లో మహీంద్రా ఆధిపత్యానికి బ్రేకులు వేయడానికి మార్కెట్లోకి రానున్న ఆ నాలుగు మోడళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మొదటగా కియా సంస్థ తన పవర్‌ఫుల్ 7-సీటర్ మోడల్ కియా సోరెంటోను భారత్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది కియా నుంచి దేశంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ ఎస్‌యూవీ కావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో 1.6 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్‌తో నడుస్తున్న ఈ కారు, ఇండియన్ వెర్షన్‌లో 1.5 లీటర్ పవర్ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇందులో కియా బ్రాండ్ మార్క్ అయిన 12.3 అంగుళాల ట్విన్ డిస్ప్లే, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉండబోతున్నాయి.
మరోవైపు ఫ్రాన్స్ దిగ్గజం రెనాల్ట్ తన పాపులర్ డస్టర్ ప్లాట్‌ఫారమ్ మీద రెనాల్ట్ బోరియల్ పేరుతో 7-సీటర్ ఎస్‌యూవీని తీసుకువస్తోంది. ఇది డాసియా బిగ్ స్టర్ కాన్సెప్ట్ ఆధారంగా తయారవుతోంది. డస్టర్ కంటే పొడవుగా ఉండి, మరింత లోపలి స్థలం కలిగి ఉండేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. ఈ కారులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.8 లీటర్ పవర్ఫుల్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్లను ఆశించవచ్చు. ఇటీవల దీనిని భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించడంతో, లాంచ్ అతి త్వరలోనే ఉండబోతోందని స్పష్టమవుతోంది.
టయోటా సంస్థ కూడా తన సక్సెస్‌ఫుల్ మోడల్ హైరైడర్‌ను అప్‌డేట్ చేస్తోంది. టయోటా హైరైడర్ 7-సీటర్ పేరుతో రానున్న ఈ మోడల్, ప్రస్తుతం ఉన్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ కంటే పొడవుగా ఉంటుంది. ఇందులో కూడా 1.5 లీటర్ మైల్డ్-హైబ్రిడ్,స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. గ్రాండ్ విటారా ఆధారిత ఈ కొత్త వెర్షన్, పెద్ద కుటుంబాలకు, ఎక్కువ లగేజీతో ప్రయాణించే వారికి ఒక అద్భుతమైన ఎంపికగా మారనుంది. ఎస్‌యూవీ విభాగంలో టయోటా నమ్మకాన్ని ఇది మరింత పెంచుతుందనడంలో సందేహం లేదు.
చివరిగా ఎంజీ మోటార్స్ నుండి వస్తున్న ఎంజీ స్టార్‌లైట్ 560 మార్కెట్లో సంచలనం సృష్టించనుంది. ఇది దేశంలోనే ఎంజీ నుంచి రానున్న మొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 20.5kWh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ సహాయంతో ఎలక్ట్రిక్ మోటార్ కారును సునాయాసంగా నడిపిస్తుంది. ఈ కంబైన్డ్ సెటప్ 197 హార్స్‌పవర్, 230 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నేరుగా మహీంద్రా XUV 7XOకి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, ఇంధన పొదుపులో కూడా మేటిగా నిలవనుంది.