Trending News

Yamaha XSR 155 : యమహా XSR 155 సునామీ..లాంచ్ అవ్వడమే ఆలస్యం.. రికార్డు స్థాయి అమ్మకాలు

లాంచ్ అవ్వడమే ఆలస్యం.. రికార్డు స్థాయి అమ్మకాలు

Update: 2026-01-27 13:26 GMT

Yamaha XSR 155 : యమహా ఇండియాకు డిసెంబర్ 2025 ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఆ నెలలో కంపెనీ ఏకంగా 54,914 యూనిట్ల మొత్తం విక్రయాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది దాదాపు 49.3% పెరుగుదల. ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం యమహా XSR 155. విడుదలైన మొదటి నెలలోనే ఈ బైక్ 14,951 యూనిట్లు అమ్ముడై, యమహాలోనే టాప్-సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. అంటే, కంపెనీ అమ్మే ప్రతి నాలుగు బైకుల్లో ఒకటి XSR 155 కావడం విశేషం.

ఈ బైక్ ఎందుకు ఇంత సక్సెస్ అయిందంటే.. దీని నియో-రెట్రో డిజైన్. పాత కాలపు క్లాసిక్ లుక్, మోడ్రన్ టెక్నాలజీల కలయికతో ఈ బైక్ రూపొందింది. రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టియర్-డ్రాప్ షేప్ ఫ్యూయల్ ట్యాంక్, ఫ్లాట్ సీటుతో ఇది చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది. దీనికి తోడు యమహా R15లో ఉండే నమ్మకమైన 155cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ దీనికి మరింత బలాన్ని ఇచ్చింది. ఇది 18.1 bhp పవర్, 14.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉండటం వల్ల డ్రైవింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

ఫీచర్ల విషయానికి వస్తే, యమహా ఇందులో ఎక్కడా రాజీ పడలేదు. ఆర్‌15, ఎంటీ-15 లో వాడే బలమైన డెల్టాబాక్స్ ఫ్రేమ్‌పై దీనిని తయారు చేశారు. భద్రత కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (ABS), ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ముందు భాగంలో యూఎస్‌డీ (USD) ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉండటం వల్ల గతుకుల రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించవచ్చు. ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బైక్ ప్రీమియం లుక్‌ను మరింత పెంచుతుంది.

మార్కెట్లో పోటీ విషయానికి వస్తే.. యమహా XSR 155 నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, టీవీఎస్ రోనిన్ వంటి పాపులర్ బైక్‌లకు సవాల్ విసురుతోంది. తక్కువ ధరలో ఎక్కువ పర్ఫార్మెన్స్, అదిరిపోయే మైలేజీ కావాలనుకునే యువతకు ఇది ఫేవరెట్ ఛాయిస్‌గా మారింది. రాయ్‌జెడ్ఆర్ స్కూటర్, ఎఫ్‌జెడ్ సిరీస్ అమ్మకాలు కూడా బాగానే ఉన్నప్పటికీ, XSR 155 మాత్రం యమహా కంపెనీకి సరికొత్త ఊపిరి పోసింది. 2025 సంవత్సరాన్ని యమహా ఒక గొప్ప విజయంతో ముగించడానికి ఈ బైక్ ప్రధాన కారణమైంది.

Tags:    

Similar News